Cabinet Meeting on Irrigation: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నీటిపారుదలశాఖపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మల్లన్నసాగర్ నుంచి తపాస్‌పల్లికి లింక్ కాలువ తవ్వకానికి మంత్రివర్గ పచ్చజెండా ఊపింది. ఈ కాలువ తవ్వకానికి రూ.388.20 కోట్లు కేటాయించింది. తపాస్‌పల్లి జలాశయంతో సిద్దిపేట జిల్లాలో 1.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.
వనపర్తి జిల్లా బుద్దారంలోని పెద్దచెరువు పునరుద్ధరణకు 44 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పెద్దచెరువు పునరుద్ధరణ పనులకు రూ.44.71 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కల్వకుర్తి ఎత్తిపోతలలో భాగంగా ఘన్‌పూర్ బ్రాంచి కాలువ పనులకు ఆమోదం తెలిపింది. ఘన్‌పూర్ బ్రాంచి కాలువ పనుల కోసం రూ.144.43 కోట్లు కేటాయించింది. చనాకా- కొరాటా అంచనా వ్యయం 795 కోట్లకు సవరిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఘన్‌పూర్ ఆనకట్ట కాలువల వ్యవస్థలో పనులకు అంగీకారం తెలిపిన కేబినెట్.. మిగిలిన పనుల పూర్తికి రూ.50.32 కోట్లు కేటాయించింది.
వనపర్తి, గద్వాల జిల్లాల్లో 11 చెక్‌డ్యాంల నిర్మాణానికి అనుమతిస్తూ 27 కోట్లు మంజూరు చేసింది. వనపర్తి జిల్లాలోని గోపాలసముద్రం చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనుల కోసం 10.01 కోట్లు మంజూరు చేసింది. గద్వాల జిల్లాలో నలసోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం 6.69 కోట్లకు సవరణ చేసిన మంత్రి వర్గం.. పనులకు టెండర్లు పిలవాలని నిర్ణయించింది. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎత్తులోని ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు గండిరామారం చెరువు నుంచి కన్నారం చెరువు వరకు పంప్ హౌస్, కాలువ పనులకు ఆమోదం తెలిపింది. దేవాదుల కింద 104 కోట్ల పనులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. గుండ్లసాగర్ నుంచి లౌక్యతండా వరకు పైప్‌లైన్ పనులకు, నశ్కల్ జలాశయం వద్ద పంప్ హౌస్ నిర్మాణానికి, దేవాదుల కింద 104.92 కోట్ల పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
సూర్యాపేట జిల్లాలో ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ నుంచి నిర్మించతలపెట్టిన ఎత్తిపోతల పథకానికి, జాన్ పహాడ్ బ్రాంచ్ కెనాల్ నుంచి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకాలకు 16.23 కోట్లతో పచ్చజెండా ఊపింది. సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధుల సేకరణ కోసం మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇదీ చూడండి: