ఎల్లుండి మధ్యాహ్నం మూడు గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అవుతోంది. ఆర్టీసీ అంశమే ప్రధాన ఏజెండాగా ఈ సమావేశం జరగనుంది.
ఆర్టీసీ ప్రధానాంశంగా ఎల్లుండి "కేబినెట్" సమావేశం - Telangana Cabinet
ఆర్టీసీ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు ముహుర్తం కూడా ఖరారైంది. శనివారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఆర్టీసీ ప్రధానాంశంగా జరగనుంది.
ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లకు అనుమతులు..!
కార్మికుల సమ్మె కొనసాగుతున్న తరుణంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ రవాణా విధానాన్ని అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆర్టీసీలో సగం యాజమాన్య బస్సులు, 30శాతం అద్దె బస్సులు మిగతా 20 శాతం ప్రయివేట్ స్టేజ్ క్యారియర్లు ఉండాలన్నది సర్కార్ ఆలోచన. అందుకు అనుగుణంగా ఇప్పటికే 21శాతం ఉన్న అద్దె బస్సులకు అదనంగా మిగతా 9 శాతం భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక మిగిలింది ప్రయివేటు స్టేజ్ క్యారియర్లకు అనుమతులు ఇవ్వడమే.
4వేల నుంచి 5వేల వరకు...!
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టం ప్రకారం... ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కోసం ప్రైవేటు స్టేజ్ క్యారియర్లకు అనుమతులు ఇవ్వొచ్చని సీఎం కేసీఆర్ ఇప్పటికే తెలిపారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు
రంగం సిద్ధమవుతోంది.
నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు రూట్లలో అనుమతుల ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే మార్గాల్లో ప్రైవేట్ స్టేజ్ క్యారియర్లకు అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటు హైదరాబాద్లో మెట్రో రైలుకు సర్వీసుల అనుసంధానం, సెట్విన్ సేవలు వినియోగించుకోవడం లాంటి ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. వీటన్నింటిపై శనివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు పురపాలక ఎన్నికలు సహా ఇతర అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు.