కారు కదిలితేనే కుటుంబ పోషణ గడిచేది. క్యాబ్ చక్రం తిరిగితేనే.. వారి జీవనచక్రం నడిచేది. రోజంతా తిరిగిన రైడ్లతో వచ్చిన సంపాదనే ఆ కుటుంబానికి ఆధారం. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఇంటి అద్దె, క్యాబ్ కిస్తీలు.. ఇవన్నీ ఆ నాలుగు చక్రాలపైనే ఆధారపడి ఉన్నాయి. మొన్నటిదాకా కరోనా సృష్టించిన కకావికలం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న క్యాబ్ డ్రైవర్ల(Cab Drivers problems)కు.. పెరుగుతున్న ఇంధన ధరలు గుండెదడ పుట్టిస్తున్నాయి.
రూ.65 నుంచి రూ.102కు
లీటర్‌కు రూ.65 ఉన్న డీజిల్ కాస్త ఇప్పుడు రూ.102కు చేరుకుంది. పెరిగిన ఇంధన ధరలతో తాము ఆర్థికంగా చితికిపోయామని క్యాబ్ డ్రైవర్లు(Cab Drivers problems) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ ధర పెరిగినా.. క్యాబ్ రైడ్ ధర మాత్రం పెంచలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. కేంద్ర సర్కార్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా.. పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందని వాపోతున్నారు.
అంతంతమాత్రమే గిరాకీ..
రాష్ట్రంలో 4.75 లక్షల పైచిలుకు క్యాబ్‌లు ఉన్నాయి. కేవలం గ్రేటర్ పరిధిలో 1.50 లక్షల క్యాబ్‌లు వివిధ ఐటీ సంస్థల్లో, ఓలా, ఊబర్ సంస్థల్లో నడుపుతున్నారు. కరోనా వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తుండటం వల్ల ఐటీ సంస్థల్లో క్యాబ్ నడిపే(Cab Drivers problems) వారి పొట్టగడవడం కష్టంగా మారింది. మహమ్మారి సృష్టించిన విలయతాండవం నుంచి కోలుకుంటున్న సమయంలో వరుసగా పెరుగుతున్న డీజిల్ ధరలతో గిరాకీలు అంతంత మాత్రమే వస్తున్నాయని క్యాబ్ డ్రైవర్లు(Cab Drivers problems) చెబుతున్నారు. ఈ ప్రభావం వల్ల క్యాబ్‌ల కిస్తీలు సరైన సమయంలో కట్టలేకపోతున్నామని వాపోతున్నారు.