commodities price hike : ఉప్పు, పప్పు, వంట నూనె, కరెంటు బిల్లులు, పెట్రోల్ బాదుడు.. అబ్బో తలచుకుంటేనే మధ్య తరగతి ప్రజలు వణికిపోతున్నారు. మూడేళ్ల నాటితో పోలిస్తే.. ఇంటి ఖర్చు సగటున నెలకు రూ.5,200కు పైగా పెరిగింది. అద్దె జీవులైతే.. ఏటా 5 నుంచి 10 శాతం పెంపుతో అదనపు భారం తప్పదు. వంట నూనెల మంటలు అంతా ఇంతా కాదు. లీటరు రూ.60లోపు ఉండే పామోలిన్ ధర.. గతేదాడి రూ. 120కి చేరగా.. ఇప్పుడు ఏకంగా రూ.165 దాటేస్తోంది. పొద్దు తిరుగుడు నూనెదీ అదే దారి. ఏడాది కిందట పచారీ దుకాణానికి ఇచ్చే సొమ్ముతో పోలిస్తే.. రూ.1,000 నుంచి రూ.1,500ల వరకు పెరుగుదల కనిపిస్తోంది. కరోనా ప్రభావంతో పట్ణణాల్లో, పంటలు దెబ్బతిని గ్రామాల్లో ఉపాధి కరవైంది. అటు పనుల్లేక, ఇటు ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్నారు.
commodities price hike in AP : కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పుల ధరల్లో పెరుగుదల అధికంగా ఉంది. కరోనా సమయంలో ధరలు భారీగానే పెరిగినా తర్వాత కాస్త నెమ్మదించాయి. కొంతకాలంగా నిలకడగా సాగుతున్నాయి. ఈ ఏడాది కంది, సెనగల దిగుబడి తగ్గడంతో ఈ ప్రభావం ధరలపై పడొచ్చు. సగటున చూస్తే నెలకు కిలో చొప్పున కుటుంబంపై నెలకు రూ.65 చొప్పున భారం పెరిగింది. 5 కిలోల గోధుమపిండి ప్యాకెట్ ధర 2019లో రూ.205 ఉండగా.. ఇప్పుడు రూ.270 చొప్పున అమ్ముతున్నారు.
మరో పక్క ఫోన్ బిల్లు మనకు తెలియకుండానే పెరిగిపోతోంది. గతంలో 3 నెలలకు రూ.333 ఉండే రీఛార్జ్.. ఇప్పుడు రూ.666కు చేరింది. దీనికి తోడు వై-ఫై రూపంలో నెలకు రూ.500 వరకు అదనపు భారం తప్పట్లేదు. కేబుల్ టీవీ ఖర్చు రూ.250 వరకు అదనం. ఒక్కో ఓటీటీ ఛానెల్‌కు సగటున రూ.500 చొప్పున నాలుగు తీసుకున్నా.. రూ.2 వేలు. అంటే నెలకు రూ.166 చొప్పున ఖర్చవుతుంది. ఒక్కో కుటుంబంపైనా మొబైల్, కేబుల్ బిల్లుల రూపంలోనే నెలకు రూ.600 వరకు అవుతోంది. వై-ఫై, ఓటీటీ తీసుకున్న కుటుంబాలకు నెలకు రూ.1,000 చొప్పున తప్పట్లేదు.
2019 మధ్యలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.600 వరకు ఉంది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.972 అయింది. అంటే మూడేళ్లలో 62 శాతం పెరిగింది. అప్పటితో పోలిస్తే రాయితీ కూడా తగ్గిపోయింది. రూ.15 చొప్పునే నామమాత్రంగా ఇస్తున్నారు. నెలకు ఒక సిలిండర్ లెక్కన చూస్తే.. ఒక్కో కుటుంబంపై రూ.372 చొప్పున భారం పడుతోంది. పేద, మధ్య తరగతిపై కరెంటు బిల్లుల భారమూ అధికమైంది. గతంలో సగటున రూ.500 చొప్పున బిల్లు వచ్చే కుటుంబానికి ఇప్పుడు రూ.650 వరకు చేరింది. అంటే సగటున 30 శాతం వరకు పెరిగాయి. వీటి రూపంలో ఒక్కో కుటుంబానికి రూ.150 చొప్పున అదనపు ఖర్చు తప్పడం లేదు. ఏడాదికి రూ.1,800 వరకు ప్రభుత్వం బాదేస్తోంది.