రాష్ట్రంలో నగరపాలక సంస్థలు (జీహెచ్‌ఎంసీ మినహా), పురపాలక సంఘాల్లో గత రెండు వారాలుగా భవన నిర్మాణ అనుమతులు నిలిచిపోయాయి. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పిస్తున్నా తదుపరి ప్రక్రియ మాత్రం జరగడం లేదు.
ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో పడి పేరుకుపోతున్నాయి. వాస్తవానికి భవన నిర్మాణ అనుమతులను 21 రోజుల్లో ఇవ్వాల్సి ఉండగా 15 రోజులైనా దరఖాస్తులు ముందుకు కదలడంలేదు. జీహెచ్‌ఎంసీ మినహా మిగిలిన 141 పట్టణ స్థానిక సంస్థల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
సాంకేతిక సంస్థ విధులకు దూరమవ్వడం వల్లే..
డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం (డీపీఎంఎస్) ద్వారా రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులను ఆన్‌లైన్‌లో ఇస్తున్నారు. అనుమతుల దరఖాస్తులను అప్‌లోడ్ చేసిన తర్వాత సాంకేతిక తోడ్పాటు అందించే సంస్థ దరఖాస్తులను పరిశీలిస్తుంది.
అన్నీ సక్రమంగా ఉన్న దరఖాస్తులు పట్టణ ప్రణాళిక అధికారులకు చేరుతాయి. వీరు పరిశీలించి ఆమోదం తెలిపితే భవన నిర్మాణ అనుమతి వస్తుంది. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతులకు సాంకేతిక తోడ్పాటును అందిస్తున్న సంస్థ విధులకు దూరంగా ఉన్నందునే అనుమతుల ప్రక్రియ స్తంభించినట్లు పట్టణ ప్రణాళిక అధికారులు పేర్కొంటున్నారు.
ఇదీ చూడండి:కోవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ తొలిదశ విజయవంతం