Budget Allocations For Telangana 2022 : వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధికి కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపు తగ్గించడం చర్చనీయాంశమవుతోంది. కొవిడ్ సంక్షోభం నుంచి వ్యవసాయాన్ని ఆదుకునేందుకు కేంద్రం గత ఏడాది రూ.లక్ష కోట్లతో ‘వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి’ని ఏర్పాటు చేసింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఏ నిర్మాణాలు చేపట్టినా అతి తక్కువ వడ్డీకే బ్యాంకులు రుణాలిస్తాయని, వీటిపై వడ్డీ రాయితీని కేంద్రం భరిస్తుందని ఈ పథకంలో తెలిపారు. ఆ రాయితీకి గత బడ్జెట్లో తొలుత రూ.900 కోట్లు కేటాయించి చివరికి సవరించిన అంచనాల్లో రూ.200 కోట్లకు తగ్గించేశారు.
Union Budget 2022 : తాజా బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించినా ఎంత విడుదల చేస్తారో ప్రశ్నార్థకమే. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 16,316 మంది రూ.10,840 కోట్ల రుణాల కోసం దరఖాస్తు చేస్తే, ఇప్పటివరకు రూ.6,649 కోట్లు మంజూరయ్యాయి. అందులోనూ రూ.2,666 కోట్లు మాత్రమే బ్యాంకులు విడుదల చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఈ పథకం కింద రూ.10 వేల కోట్లు, వచ్చే మూడేళ్ల పాటు వరుసగా రూ.30 వేల కోట్ల చొప్పున, మొత్తం నాలుగేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు పంపిణీ చేయాలనేది లక్ష్యం. కానీ తొలి ఏడాది పూర్తికావస్తున్నా బ్యాంకులు రూ. 10 వేల కోట్లలో నాలుగో వంతు మాత్రమే రుణాలిచ్చాయి.
రాయితీ ఆకర్షణీయంగా లేక..
Budget For Agriculture Sector 2022 : ఈ పథకంపై తగిన ప్రచారం లేదు. గతంలో ఇలాంటి పథకాల్లో లబ్ధిదారులు రుణం సొమ్మును పూర్తిగా తిరిగి చెల్లిస్తే, అందులో కొంత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీగా ఇచ్చేవి. దీనివల్ల ఎక్కువ మంది రుణాల కోసం ముందుకొచ్చేవారు. దేశవ్యాప్తంగా గోదాముల నిర్మాణానికి గతంలో రుణాలిచ్చినప్పుడు అందులో కొంత సొమ్మును ప్రభుత్వాలు రాయితీగా భరించాయి. కానీ కొత్త పథకంలో రుణంపై వడ్డీలో కేవలం 3 శాతం మాత్రమే రాయితీగా వస్తుంది. అదీ రూ. 2 కోట్ల రుణం వరకే వర్తిస్తుంది. ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా వడ్డీలు వేస్తున్నాయి. సహకార బ్యాంకులు 4, వాణిజ్య బ్యాంకులు 9 శాతం దాకా వడ్డీ వసూలు చేస్తున్నాయి. మొత్తంగా రాయితీ ఆకర్షణీయంగా లేకపోవడంతో తెలంగాణలో పెద్దగా ఎవరూ దరఖాస్తు చేయడం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 207 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) ఈ రుణాల కోసం దరఖాస్తు చేయగా రూ.187 కోట్లు సహకార బ్యాంకులు మంజూరు చేశాయి. తెలంగాణలో రూ.3075 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.6540 కోట్లు రుణాలుగా ఇవ్వాలని కేంద్రం తెలిపింది. దేశంలోకెల్లా అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు రూ.12,831 కోట్లు కేటాయించింది. తెలంగాణంలో రుణాల పంపిణీకి రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్)లో ప్రత్యేకంగా ఓ విభాగాన్ని సైతం నాబార్డు ఏర్పాటు చేసింది.