తెలంగాణ

telangana

ETV Bharat / city

డిగ్రీలో ఇక మీకు నచ్చిన సబ్జెక్ట్​ ఎంచుకోండి!

డిగ్రీలో చేరి మీకు నచ్చిన సబ్జెక్టును మీరే ఎన్నుకునే అవకాశాన్ని కల్పిస్తోంది తెలంగాణ విద్యాశాఖ. మీకు నచ్చిన సబ్జెక్టు మీరు చదివుతోన్న కళాశాలలో లేకుంటే ఆన్​లైన్​లో నేర్చుకోవచ్చని చెబుతోంది. విద్యార్థులెంతగానో ఎదురుచూస్తోన్న ఈ బకెట్ విధానం ఈ ఏడాది నుంచి అమల్లోకి రానుంది.

bucket procedure in telangana degree colleges will be implemented from this year
డిగ్రీలో ఇక మీకు నచ్చిన సబ్జెక్ట్​ ఎంచుకోండి!

By

Published : Jun 13, 2020, 9:45 AM IST

డిగ్రీలో చేరితే కళాశాలలు చెప్పిన లేదా అక్కడున్న మూడు సబ్జెక్టులను ఇష్టమున్నా లేకున్నా చదువుకోవాల్సిన అవసరం ఇక ఉండదు. నూతన విద్యా సంవత్సరం (2020-21) నుంచి విద్యార్థులు తమకు ఇష్టమైన కాంబినేషన్లను ఎంచుకోవచ్చు. ఇది బీఏ, బీకాం విద్యార్థులకు, సివిల్స్‌, గ్రూప్స్‌ లాంటి పోటీ పరీక్షలకు బాగా ఉపయోగపడుతుందని విద్యాశాఖ భావిస్తోంది.

విద్యార్థి చేరిన కళాశాలలో తనకు ఆసక్తి ఉన్న సబ్జెక్టు లేకుంటే ఆన్‌లైన్‌లో దాన్ని చదువుకోవచ్చు. బకెట్‌ విధానంగా దీన్ని పిలుస్తారు. అంటే ఒక్కో బకెట్‌లో కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కో దాంట్లోంచి విద్యార్థి ఒక దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీన్ని గత విద్యా సంవత్సరమే ప్రయోగాత్మకంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అమలుచేయగా ఈసారి అన్ని ప్రైవేట్‌ కళాశాలల్లోనూ అమలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాలు నిర్ణయించాయి.

దీని వల్ల ఛాయిస్‌ బేస్‌డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (సీబీసీఎస్‌) స్ఫూర్తిని నిజంగా అమలు చేసినట్లవుతుందని అధికారులు భావిస్తున్నారు.

కొత్త విధానం ఇదీ.. ప్రయోజనాలు ఇవీ..

  • బీఎస్‌సీలో ఫిజికల్‌, లైఫ్‌ సైన్స్‌గా విభజిస్తారు. ఫిజికల్‌ సైన్స్‌ తీసుకునేవారు గణితం, లైఫ్‌ సైన్స్‌ వారు రసాయనశాస్త్రం తప్పకుండా చదవాలి. మిగిలిన రెండు సబ్జెక్టులు విద్యార్థి ఇష్టం. అంటే అక్కడ నాలుగు రకాల గ్రూపులుంటే మూడు ఎంచుకోవాలి. ఇష్టమైనది లేకుంటే ఆన్‌లైన్‌కు వెళ్లొచ్చు.
  • బీఏ చదవాలనుకున్న విద్యార్థికి ఒక కళాశాలలో సీటు వచ్చింది. అతనికి ఆసక్తి ఉన్న జాగ్రఫీ అక్కడ లేకుంటే ఉన్న మూడు సబ్జెక్టులను చదవాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్త విధానంలో అక్కడ లేని సబ్జెక్టులను ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు. దాంతో వారు తర్వాత వివిధ ఉద్యోగ పరీక్షలకు పోటీపడటానికి సులభమవుతుంది.
  • కళాశాల విద్యాశాఖ సోషియాలజీ, జాగ్రఫీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సైకాలజీ, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ సబ్జెక్టులను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. గత ఏడాదే హైదరాబాద్‌ సిటీ కళాశాలలో వర్చువల్‌ తరగతుల బోధనకు స్టూడియో నిర్మించారు. అక్కడ అధ్యాపకులు బోధిస్తుంటే ఆయా కళాశాలల్లోని విద్యార్థులు వర్చువల్‌ తరగతి గది నుంచి వినొచ్చు.
  • ఆర్ట్స్‌ కోర్సుల్లో 20 శాతం క్రెడిట్లను ‘స్వయం’ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌ కోర్సులను పూర్తి చేసేలా అవకాశం ఇస్తారు. వారే పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్‌ ఇస్తారు. ఆ క్రెడిట్లను డిగ్రీలోకి బదిలీ చేస్తారు.
  • డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ (దోస్త్‌) ద్వారా ప్రవేశాలు పొందే సమయంలోనే ఆన్‌లైన్‌ సబ్జెక్టులను కూడా ఎంచుకునే అవకాశం ఇస్తారు. ఇంటర్‌ ఫలితాలు ప్రకటించగానే దోస్త్‌ ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.

ABOUT THE AUTHOR

...view details