తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో ద్రాక్ష సాగుకు పూర్వ వైభవం తెచ్చేలా ప్రణాళికలు

Brain Storming On Grapes crop: రాష్ట్రంలో పండ్ల తోటల ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో ద్రాక్ష సాగుపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ద్రాక్ష సాగుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో ఉద్యాన శాఖ, శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం అడుగులు వేస్తోంది. పంట పండించేందుకు ముందుకు వచ్చే రైతులకు... రుణాలు, రాయితీలు ఇచ్చి ప్రోత్సహించేందుకు ఉద్యాన శాఖ ప్రణాళికలు రచిస్తోంది.

Brain Storming On Grapes crop
Brain Storming On Grapes crop

By

Published : Feb 13, 2022, 2:59 AM IST

Updated : Feb 13, 2022, 4:55 AM IST

రాష్ట్రంలో ద్రాక్ష సాగుకు పూర్వ వైభవం తెచ్చేలా ప్రణాళికలు

Brain Storming On Grapes crop Area Expansion: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఉద్యాన కళాశాలలో రాష్ట్రస్థాయి ద్రాక్ష సాగు మేధోమదనం జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ద్రాక్ష రైతులు, ఔత్సాహిక, యువ అన్నదాతలతో పాటు అధికారులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ద్రాక్ష సాగుకు ఉన్న అవకాశాలు, పంట పునరుద్ధరణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిస్తున్న రాయితీలు, మార్కెటింగ్, విదేశీ ఎగుమతులు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో పంట సాగుకు అపార అవకాశాలు ఉన్నాయని రైతులకు అవగాహన కల్పించారు.

ఒకప్పుడు వెలుగులు పొంది..

ద్రాక్షను తాజా పండు వినియోగం, ఎండు ద్రాక్ష, వైన్, రసంగా ప్రాసెస్ చేయడానికి పండిస్తారు. ఒకప్పుడు వెలుగులు పొందిన ద్రాక్ష సాగు ఇప్పుడు పూర్వ వైభవంగా మిగిలిపోయింది. 1960 - 70 మధ్యకాలంలో పంట సాగు శిఖర స్థాయిలో ఉంది. అనబ్‌-ఇ-షాహి ద్రాక్ష ఆ రోజుల్లో పండే రకం. ఈ రకం గరిష్టంగా హెక్టారుకు 100 మెట్రిక్ టన్నులు దిగుబడి ఇచ్చి ప్రపంచ రికార్డు సాధించింది. ఈ రకం ఎఫ్‌ఏఓ నిపుణుడు డాక్టర్ ఓల్మో... బయోలాజికల్ వండర్‌గా అభివర్ణించడం విశేషం. ఆ సమయంలో ద్రాక్ష సాగు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు 30 కిలోమీటర్ల దూరం వరకు కేంద్రీకృతమైంది. ద్రాక్ష సాగు, అధిక పెట్టుబడి, అధిక ఖర్చుతో కూడుకున్న పంట. సాగుకు అత్యంత సాంకేతిక పరిజ్ఞానం అవసరం.

రెండో స్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌..

అప్పట్లో ధనవంతులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ధనిక గుజరాతీలు, కెన్యా, ఉగాండా నుంచి వలస వచ్చిన సంపన్నులు ద్రాక్ష సాగు చేపట్టారు. క్రమంగా స్థానికంగా సంపన్న రైతులు సాగులోకి ప్రవేశించి 1990 నాటికి ద్రాక్ష సాగు 10 వేల ఎకరాలకు పెంచారు. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌... దేశంలో కర్ణాటక తర్వాత అధికంగా ద్రాక్ష ఉత్పత్తి చేసే రాష్ట్రంగా రెండో స్థానంలో నిలిచింది. ద్రాక్ష సాగు ఒక పరిశ్రమ లాంటిది. ధనిక రైతులు పెట్టుబడి పెట్టడంతో కన్సల్టెంట్లు సాంకేతిక పరిజ్ఞానం, సూచనలు, సలహాలు అందించారు. క్షేత్ర నిర్వాహకుడు తోటలో యాజమాన్య పద్ధతులు నిర్వహించారు. అన్ని ఖర్చుల నడుమ చివరగా లాభమా లేదా నష్టమా అనే విషయంపైనే ద్రాక్ష సాగు నిలబడే స్థాయికి చేరుకుంది. ద్రాక్ష పంట సాగుకు పూర్వవైభవం సాధ్యమేనని శాస్త్రవేత్తలు భరోసా ఇచ్చారు.

ఏడవ స్థానంలో భారత్‌:

ప్రపంచవ్యాప్తంగా చైనా, ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్, టర్కీ, భారత్‌, చిలీ, ఇరాన్ అర్జెంటీనా తదితర దేశాల్లో మొత్తం 81.42 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ద్రాక్ష పంట సాగవుతోంది. ద్రాక్ష ఉత్పత్తిలో చైనా అగ్రస్థానంలో ఉంది. 8.40 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతూ... 148.40 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధిస్తూ ముందు వరసలో నిలబడింది. రెండో స్థానంలో ఇటలీలో 6.70 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతూ... 82 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి సాధిస్తుంది. ఏడవ స్థానంలో ఉన్న భారత్‌లో 1.54 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంది. 32.60 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి సాధిస్తుంది.

ఎకరానికి రూ.5 లక్షల రాయితీ ఇచ్చి..

ఇక దేశంలో రాష్ట్రాల వారీ సాగు పరిశీలిస్తే... మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా... కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మిజోరం, తమిళనాడు, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, పంజాబ్‌ రాష్ట్రాలు వరస క్రమంలో ఉన్నాయి. తెలంగాణలో 838 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్‌లో 5853 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతోంది. రాష్ట్రంలో మేడ్చల్‌ - మల్కాజిగిరి, రంగారెడ్డి, సిద్ధిపేట తదితర జిల్లాల్లో ద్రాక్ష సాగవుతుంది. వినియోగం, గిరాకీ దృష్ట్యా... దిగుమతులపై ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా ఉండాలంటే స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో 5 వేల ఎకరాల విస్తీర్ణంలో సాగుపెంచాలని ఉద్యానశాఖ ప్రతిపాదించింది. నికర ఆదాయమిచ్చే ధీర్ఘకాలిక భరోసా గల పంట సాగుకు ముందుకొచ్చే రైతులకు ఎకరానికి 5 లక్షల రూపాయలు చొప్పున రాయితీ ఇచ్చి ప్రోత్సహించేందుకు నాబార్డుతో సంప్రదింపులు చేస్తున్నామని ఉద్యాన శాఖ కమిషనర్ లోక వెంకటరామిరెడ్డి వెల్లడించారు.

11,145 మెట్రిక్ టన్నుల దిగుబడి..

రాష్ట్రంలో ద్రాక్ష పంట సాలీనా 11,145 మెట్రిక్ టన్నుల దిగుబడి ఇస్తుంది. ఆ విలువ 44 కోట్ల రూపాయలు. ఉత్పతాదకత ఎకరాకు 13.30 టన్నులు చొప్పున లభిస్తోంది. ప్రపంచంలో ద్రాక్షను అధికంగా వైన్ రూపంలో వినియోగించడం పరిపాటి. మొత్తం ద్రాక్ష ఉత్పత్తిలో 88 శాతం వైన్, 8 శాతం తాజా ద్రాక్ష, 4 శాతం ఎండు ద్రాక్ష రూపంలో వినియోగిస్తున్నారు. ప్రత్యేకించి భారతదేశంలో మొత్తం ద్రాక్ష ఉత్పత్తిలో 80 శాతం ద్రాక్షగా... 18 శాతం ఎండు ద్రాక్షగా... 2 శాతం వైన్‌, జ్యూస్‌గా వినియోగిస్తుండటం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం వార్షిక వినియోగం 31772 మెట్రిక్ టన్నులుకాగా... వినియోగంపై వార్షిక వ్యయం 302.43 కోట్ల రూపాయలుగా నమోదైంది. వార్షిక లోటు ఉత్పత్తి 20627 మెట్రిక్ టన్నులు భర్తీ కోసం ఏటా 196.34 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తున్న దృష్ట్యా... పెద్ద ఎత్తున సాగు విస్తీర్ణం పెంపుకు ఓ ముందడుగు పడింది.

ఇదీ చూడండి:Pollution: నిబంధనలకు నీళ్లొదలిన ఫార్మా కంపెనీలు.. కాలుష్య కోరల్లో పల్లెలు

Last Updated : Feb 13, 2022, 4:55 AM IST

ABOUT THE AUTHOR

...view details