ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోనే పోతూలూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామి నియామకం ఖరారైంది. నెలరోజులుగా వారసత్వ వ్యవహారంపై కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వివాదాన్ని ప్రభుత్వం సామరస్యంగా పరిష్కరించింది. ప్రత్యేక అధికారి, స్థానిక ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో పలుమార్లు చర్చించి.. వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చారు.
గత నెల 8న మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి శివైక్యం పొందగా.. అప్పటి నుంచి తదుపరి పీఠాధిపతి ఎవరన్న దానిపై వారసుల మధ్య వివాదం నడుస్తోంది. వెంకటేశ్వరస్వామి మొదటి భార్య కుమారులు, రెండోభార్య కుమారులు పీఠాధిపత్యం కోసం పట్టుబట్టారు. తెలుగు రాష్ట్రాల మఠాధిపతులు, ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపినా సమస్య కొలిక్కి రాలేదు.