తెలంగాణ

telangana

ETV Bharat / city

కృష్ణా బోర్డు లేఖలకు సమాధానమెక్కడ? - krishna water dispute tribunal

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 12వ సమావేశ అజెండాలో చేర్చాల్సిన అంశాలను పంపాలన్న బోర్డు సూచనకు రెండు తెలుగు రాష్ట్రాలు స్పందించలేదు.

both Telugu states failed to replay to Krishna river board over water dispute
కృష్ణా బోర్డు లేఖలకు సమాధానమెక్కడ?

By

Published : May 29, 2020, 6:14 AM IST

కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల సమగ్ర నివేదిక(డీపీఆర్‌)లు, టెలిమెట్రీ రెండోదశ, నిధులు తదితర అంశాలను బోర్డు అజెండాలో చేర్చింది. ఇంకా చేర్చాల్సిన విషయాలుంటే ఈ నెల 26 లోగా సూచించాలని రెండు రాష్ట్రాలకు 21వ తేదీన లేఖలు రాసింది. దీనిపై గురువారం సాయంత్రం వరకు రెండు రాష్ట్రాల నుంచి సమాధానం అందలేదు. అజెండాను శుక్రవారం లోగా ఖరారు చేయాల్సి ఉందని, ఈలోగానైనా పంపాలని రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు బోర్డు తాజాగా సూచించినట్లు తెలిసింది.

శ్రీశైలం నుంచి కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ కూడా తెలంగాణపై ఫిర్యాదు చేసింది. దీంతో బోర్డు ఒక రాష్ట్రం చేసిన ఫిర్యాదును ఇంకో రాష్ట్రానికి పంపి వివరణ కోరింది. ఈ వివరణలు కూడా ఇంకా అందలేదు. అజెండా ఖరారులో రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.

కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం కోసం అజెండాలో చేర్చాల్సిన అంశాలను వెంటనే పంపాలని బోర్డు ఈ నెల 21న రెండు రాష్ట్రాలకు రాసిన లేఖకు కూడా స్పందన లేదు. వచ్చే వారంలో కృష్ణా బోర్డు సమావేశం నిర్వహించే అవకాశం ఉందని, దీని తర్వాతే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం గురించి ఆలోచిస్తారని సమాచారం.
ముందుకెళ్లొద్దని కేంద్రం చెప్పింది

‘కొత్త ప్రాజెక్టు’పై ఆంధ్రప్రదేశ్‌కు బోర్డు లేఖ

శ్రీశైలం నుంచి నీటిని తీసుకునేలా చేపట్టిన కొత్త ప్రాజెక్టు విషయంలో బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదించే వరకు ముందుకెళ్లొద్దంటూ కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ సూచించిందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్‌ దృష్టికి తెచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి కృష్ణా బోర్డు ఇటీవల లేఖ రాసింది. బోర్డు అభిప్రాయంగా గాని, సూచన గాని చేయకుండా కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ నుంచి వచ్చిన విషయాన్ని మీకు పంపుతున్నామంటూ లేఖలో పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా నదిలో కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కృష్ణా బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం అవసరమని, కొత్త ఎత్తిపోతల చేపడుతూ ఆంధ్రప్రదేశ్‌ జారీ చేసిన జీవో 203 పునర్విభజన చట్టం 11వ షెడ్యూలులోని సెక్షన్‌-84కు విరుద్ధమని, ఈ నేపథ్యంలో ముందుకెళ్లొద్దని సూచిస్తూ కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ లేఖ రాసిందని, ఆ లేఖను పంపుతున్నామని బోర్డు పేర్కొంది. త్వరలోనే ఈ అంశంపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తామని బోర్డు తరఫున హరికేశ్‌ మీనా ఆంధ్రప్రదేశ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details