బోనాల పండుగ(Bonalu)కు భాగ్యనగరం ముస్తాబవుతోంది. కరోనాతో గతేడాది బోనాలు నిర్వహించుకోలేకపోయాం. ఈ ఏడు రెట్టింపు ఉత్సాహంతో.. అంగరంగవైభవంగా బోనాల పండుగ నిర్వహించడానికి రంగం సిద్ధమవుతోంది. ఆషాఢం తొలి ఆదివారమైన ఈనెల 11న గోల్కొండ కోటలో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. రాష్ట్ర పండుగగా జరిగే ఈ వేడుకలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి, గోల్కొండ జగదాంబిక, బల్కంపేట ఎల్లమ్మ, పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయాలు ముస్తాబవుతున్నాయి. గతేడాది కరోనా నిబంధనలతో సంప్రదాయ ప్రకారం జరిగిన ఉత్సవాలను ఈ ఏడాది అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గోల్కొండ కోటలో ప్రారంభం..
సంప్రదాయం ప్రకారం గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కుతుబ్‌షాహీ రాజైన తానీషా హయాంలో మంత్రులైన అక్కన్న, మాదన్నలు ఈ ఆలయాన్ని నిర్మించారు. జులై 11న మొదటి పూజ ప్రారంభం కానుంది. లంగర్‌హౌస్ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ఈ ఊరేగింపు.. ఆలయం వరకూ సాగుతుంది. ఈ సందర్భంగా మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బడాబజార్‌లోని పూజారి అనంతచారి ఇంట్లో అమ్మవారి విగ్రహాలకు పూజలు నిర్వహించి కోటపైని ఆలయానికి తీసుకొస్తారు.
జులై 11న రథం, తొట్టెల ఊరేగింపు, మొదటి పూజ
22న నాల్గో పూజ, చండీహోమం
29న ఆరో పూజ, శాకాంబరి పూజ
ఆగస్టు 8న తొమ్మిదో పూజతోపాటు అమ్మవారి సమారోహన కుంబార్తి వేడుకలు
ఘటోత్సవం.. రంగం
రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో ఈనెల 11న ఘటోత్సవం నిర్వహించనున్నారు. ఇక్కడ ఉత్సవాలు 15 రోజుల పాటు కొనసాగుతాయి. ఘటోత్సవం నుంచి బోనాల సమర్పించే ముందు రోజు వరకు అమ్మవారు సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘటం ఊరేగింపు ద్వారా దర్శనమిస్తారు. నైవేద్యం సమర్పించడం, పోతరాజుల నృత్యాలు, తొట్టెలు, ఫలహారం బండ్ల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆలయ పుర వీధుల్లో ఏనుగుపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు కనులపండువగా జరగనున్నాయి.