తెలంగాణ

telangana

ETV Bharat / city

అరుదైన రక్తం.. ఆదుకున్న మానవత్వం - గుంటూరు తాజా వార్తలు

బాంబే బ్లడ్​ గ్రూప్​. ఈ పేరు వింటే గుర్తొచ్చే సినిమా పేరు ఒక్కడున్నాడు. ఇది అరుదైన బ్లడ్​ గ్రూప్​లలో ఒకటి. ఇదే బ్లడ్​ గ్రూప్​ ఏపీలోని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైంది. అది కూడా ఓ నిండు గర్భిణీకి. రెండు వారాలుగా రెండు రాష్ట్రాల్లో వెతికారు. దొరకడం కష్టమైంది. ఇలాంటి లాక్​డౌన్ సమయంలో ఒక్కడిని ఉన్నానంటూ​ ఆన్‌లైన్‌లో సమాచారం తెలుసుకున్న వెంటనే స్పందించి రక్తదానం చేశారు గౌతమ్‌కుమార్‌.

bombay-blood-group-donated-by-hyderabadi
అరుదైన రక్తం.. ఆదుకున్న మానవత్వం

By

Published : Apr 28, 2020, 1:52 PM IST

కాన్పు కోసం ఏపీలోని గుంటూరు ఆసుపత్రిలో చేరిన గర్భిణీ అరుదైన గ్రూపు కావడంతో రక్తం కోసం రెండు వారాలుగా ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు విషయం తెలుసుకున్న హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి నేనున్నానంటూ ముందుకొచ్చి రక్తదానం చేసి మానవత్వం చాటారు.

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం, చేకూరుకు చెందిన కిరణ్‌, కృష్ణలతది వ్యవసాయ కుటుంబం. ఆమె నిండు గర్భిణీ. రెండు వారాల క్రితం గుంటూరులోని ప్రభుత్వ ఆసుత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి ఆమెకు రక్తం తక్కువగా ఉందని చెప్పారు. ఆమె గ్రూపు అరుదైనది. బాంబే ఫెనోటైప్‌ రక్తం. రక్తం ఎక్కిస్తేనే ఈ నెల 23న సర్జరీ చేస్తామని వైద్యులు చెప్పారు. అంతా లాక్‌డౌన్‌. ఎక్కడా తిరిగే పరిస్థితి లేదు. ఎవరినీ అడిగినా ఇదేమీ కొత్త రక్తం అంటున్నారు. ఏ రక్తనిధి కేంద్రాలను సంప్రదించినా ఫలితం లేదు. ఎక్కడ తిరిగినా ఫలితం లేకపోవడంతో వారు ఇచ్చిన సర్జరీ గడువు కూడా దాటిపోయింది.

రెండు వారాలు.. రెండు రాష్ట్రాల్లో గాలింపు..

భర్త, ఇతర బంధుమిత్రులు రెండు వారాలుగా రెండు రాష్ట్రాల్లో ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజునాయుడు ఆన్‌లైన్‌లో పెట్టండి ఎవరైనా దాతలుంటే ముందుకొస్తారని సూచించారు. వారి సూచన మేరకు ప్రయత్నం చేయగా హైదరాబాద్‌ ఉప్పల్‌లోని బీరప్పగడ్డలో ఉండే ప్రైవేటు ఉద్యోగి గౌతమ్‌కుమార్‌ శనివారం అందుబాటులోకి వచ్చారు. ఆయనది బాంబే ఫెనోటైప్‌ రక్తం. ఇది చాలా అరుదైన గ్రూపు అనే విషయం ఆయనకు తెలుసు.

2004 నుంచి ఏడాదికి నాలుగుసార్లు చొప్పున రక్తదానం చేస్తూ వస్తున్నారు. లాక్‌డౌన్‌తో గుంటూరుకు వెళ్లడం కష్టంగా ఉండటం వల్ల సోమవారం కిరణ్‌ ఓ వాహనానికి అనుమతి తీసుకుని హైదరాబాద్‌ వచ్చారు. గౌతమ్‌కుమార్‌ స్థానిక తెరాస నాయకుడు సదానంద్‌ సహకారంతో చిరంజీవి రక్తనిధి కేంద్రానికి వెళ్లి రక్తం ఇచ్చారు. కృష్ణలత భర్తకు రక్తం అందించి గుంటూరుకు పంపించారు.

ABOUT THE AUTHOR

...view details