తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. కేంద్రానికి(Central government ) మనసుంటే అసెంబ్లీ సీట్ల పెంపునకు మార్గం ఉండకపోదా అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Boinapally Vinod kumar) ఆక్షేపించారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి (revanth reddy) ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి 2026 వరకు అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని చెప్పడం... చూస్తుంటే పాత చింతకాయ పచ్చడి సమాధానం అని ఎద్దేవా చేశారు.
చిన్న సవరణ చాలు..
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 26వ సెక్షన్లో స్వల్ప సవరణ చేస్తే స్థానాల సంఖ్య పెంచేందుకు అవకాశం ఉందన్న ఆయన... చిన్నసవరణతో సరిపోయే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు మొండిగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని అన్నారు.
విభజన చట్టం సవరణకు డిమాండ్
తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించినప్పటికీ విభజన చట్టంలో సవరణలు చేసి ఖమ్మం జిల్లాలోని ఏడుమండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. శాసనమండలి సీట్లను కూడా పెంచారని అన్నారు. అప్పుడు చట్ట సవరణకు మనసు వచ్చిన కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలు కోరుతున్నప్పటికీ అసెంబ్లీ సీట్లను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ సీట్ల పెంపు కోసం తాను పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టానని, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించామని తెలిపారు. అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యమేనని అప్పుడు న్యాయ శాఖ ఉన్నతాధికారులు చెప్పారని వినోద్ కుమార్ గుర్తు చేశారు.