Vinod kumar fire on BJP: భాజపా నేతలకు అధికార కాంక్ష తప్ప.. రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని తెరాస సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. ఈ విషయం నిన్న భాజపా రాష్ట్ర అధ్యక్షులతో అమిత్షా జరిపిన భేటీతో తేలిపోయిందని స్పష్టం చేశారు. కేసీఆర్ను ఎలా గద్దెదించాలో చర్చించారే తప్ప.. రాష్ట్ర సమస్యలపై నోరు విప్పలేదని విమర్శించారు.
రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే యాసంగి ధాన్యం కొనుగోళ్లు, జాతీయ ప్రాజెక్టుపై మాట్లాడేవారని వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో గద్దెపై ఎవరుండాలో రెండేళ్ల తర్వాత ప్రజలు నిర్ణయిస్తారన్నారు. రాష్ట్ర రైతులను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నారని వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. అడిగిన విషయం చెప్పకుండా వంకర టింకర సమాధానం చెబుతూ.. పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. యాసంగి ధాన్యంపై గతంలో కేంద్రం ఒక తీరు, రాష్ట్ర భాజపా మరో తీరు మాట్లాడినందుకే లిఖితపూర్వకంగా ఇవ్వాలని తెరాస కోరుతోందని స్పష్టం చేశారు.