తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆ పంచాయతీలో భారీగా బోగస్ ఓట్లు.. ఆ జాబితాతోనే ఎన్నికలు! - అనకాపల్లి తాజా వార్తలు

ఏపీలో రెవెన్యూ అధికారులతో కలిసి ఓ వైకాపా నాయకుడు భారీగా బోగస్ ఓట్లను జాబితాలో చేర్చారు. ఆ తరువాత అదే ఓటరు జాబితాతో పంచాయతీ ఎన్నికలూ జరిగిపోయాయి. తాజాగా వైకాపా నాయకుల్లో తలెత్తిన వర్గ విభేదాల కారణంగా.. ఈ ‘బోగస్‌’ వ్యవహారాన్ని బయటపెట్టారు.

bogus votes
bogus votes

By

Published : Jul 3, 2022, 7:14 AM IST

ఏపీలో ఓ వైకాపా నాయకుడు, రెవెన్యూ అధికారులతో కలిసి ఏకంగా 238 బోగస్‌ ఓట్లను జాబితాలో చేర్చారు. అదే ఓటరు జాబితాతో పంచాయతీ ఎన్నికలూ జరిగిపోయాయి. ఆ ఎన్నికల్లో బోగస్‌ ఓట్లు నమోదు చేయించిన నాయకుడి బంధువే గెలుపొందారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దొప్పెర్లలో వెలుగు చూసింది. వర్గ విభేదాల కారణంగా వైకాపా నాయకులే ఈ ‘బోగస్‌’ వ్యవహారాన్ని బయటపెట్టారు. దొప్పెర్ల గ్రామంలో మొత్తం 1,265 ఓట్లున్నాయి.

ఇందులో ఐదో వంతు బోగస్‌వేనని స్థానికులు పేర్కొంటున్నారు. పంచాయతీ ఎన్నికల కంటే ముందే స్థానిక వైకాపా నాయకుడు రెవెన్యూ, బూత్‌ స్థాయి అధికారులతో కలిసి బోగస్‌ ఓట్లు నమోదు చేయించారు. సదరు నాయకుడు గుండుగుత్తగా ఇచ్చిన ఓటరు నమోదు దరఖాస్తుల్లోని పేర్లను అధికారులు ఉన్నది ఉన్నట్లు జాబితాలో చేర్చినట్లు జాబితాను పరిశీలిస్తే అర్థం అవుతుంది. ఓటరు జాబితాలో 37 మంది ఓటర్లకు ‘తండ్రి’ లేదా ‘ఇతరుల’ కాలమ్‌లో ఆ నాయకుడి పేరే నమోదు చేశారు. మరో 10 మంది ఓటర్లకు ‘సంరక్షకుడి’గా స్థానిక వాలంటీరు భర్త పేరును చేర్చారు. విశాఖ జీవీఎంసీ, చుట్టుపక్కల గ్రామస్థులు 191 మందినీ జాబితాలో దొప్పెర్ల వాసులుగా పేర్కొన్నట్లు గ్రామస్థులు గుర్తించారు. వేర్వేరు ఇంటి పేర్లున్న వారిని ఒకే ఇంటి నంబరుపై ఓటరు జాబితాలో చేర్చడం మరో విచిత్రం. ఇలా వివిధ రకాలుగా 238 బోగస్‌ ఓట్లు నమోదు చేయించిన నాయకుడి సోదరుడే గత పంచాయతీ ఎన్నికల్లో 126 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో వైకాపా నుంచే రెండు వర్గాలు పోటీపడ్డాయి. అందులో ఓడిపోయిన వర్గమే ఈ బోగస్‌ ఓట్ల వివరాలు బయటపెట్టడం గమనార్హం.

బోగస్‌ ఓట్లను ఎలమంచిలి ఉప కలెక్టర్‌ ఎస్వీ లక్ష్మణమూర్తి దృష్టికి తీసుకెళ్లగా.. ‘దొప్పెర్ల ఓటర్ల జాబితాలో అవకతవకలపై విచారణ జరుపుతాం. ఒక వ్యక్తి నుంచి అధిక సంఖ్యలో ఓటరు నమోదు దరఖాస్తులు ఎలా తీసుకున్నారో విచారిస్తాం. ఒకే వ్యక్తి పేరును ఎక్కువ మందికి ‘తండ్రి’ లేదా ‘ఇతరుల’ కాలమ్‌లో ఎలా చేర్చారు? ఒకే ఇంటిలో వివిధ ఇంటి పేర్లుతో ఉన్న వారిని జాబితాలో ఎలా చేర్చారనే విషయాలనూ పరిశీలిస్తాం’ అని తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details