తెలంగాణ

telangana

ETV Bharat / city

లాక్‌డౌన్‌తో ఇబ్బందులు.. తరిగిపోయిన రక్త నిల్వలు - లాక్‌డౌన్‌

నిమ్స్‌ ఆసుపత్రిలోని రక్త నిధి(బ్లడ్‌ బ్యాంకు)లో నిల్వలు నిండుకున్నాయి. ఆపదలో వచ్చిన వారికి రక్తాన్ని అందజేసేందుకు వైద్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలో లాక్‌డౌన్‌తో దాతలు రక్తం దానం చేసేందుకు రావడం లేదు. అత్యవసర సమయాల్లో రక్తం కావాల్సిన వారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు.

blood resources
తరిగిపోయిన రక్త నిల్వలు

By

Published : Apr 17, 2020, 10:42 AM IST

రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో ప్రస్తుతం సాధారణ శస్త్రచికిత్సలు నిలిపివేశారు. తలసేమియా, డయాలసిస్‌ వ్యాధిగ్రస్థులు, అత్యవసర శస్త్ర చికిత్సలు అవసరమున్న వారికి మాత్రం తప్పనిసరిగా రక్తం కావాల్సి ఉంటుంది. ఇలా అత్యవసర పరిస్థితుల్లో రక్తం తీసుకునేవారు ప్రతిగా వారి కుటుంబ సభ్యులు, మిత్రుల ద్వారానో ఇక్కడ రక్తం ఇస్తుంటారు. రక్తదాన శిబిరాల ద్వారా కూడా ఈ కేంద్రానికి అవసరమైన నిల్వలు సమకూరుతాయి. ఈ కేంద్రం సామర్థ్యం వెయ్యి యూనిట్లు.

లాక్‌డౌన్‌ కారణంగా ప్రజా రవాణా లేకపోవడంతో దాతలు ముందుకు రావడం లేదు. లాక్‌డౌన్‌కు ముందు ప్రతి రోజు 60 నుంచి 100 మంది వరకు దాతలు రక్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చేవారు. ప్రస్తుతం చాలా తక్కువ మంది మాత్రమే వస్తున్నారు. దీంతో రక్తనిధిలో నిల్వలు అత్యల్ప స్థాయికి చేరాయి.

రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ చొరవ..

నిమ్స్‌లో రక్తం కోసం వచ్చే వ్యాధిగ్రస్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సేవలందించేందుకు నిమ్స్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ముందుకు వచ్చింది. ఆసుపత్రిలో పలు విభాగాల్లో మొత్తం 423 మంది రెసిడెంట్‌ వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం కొంత మంది రక్తం ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

గురువారం తనతో పాటు కొందరు వైద్యులు బ్లడ్‌ బ్యాంకులో రక్తదానం చేసినట్లు ఆయన చెప్పారు. ఆపత్కాల పరిస్థితి దృష్ట్యా ప్రజలు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. రక్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చే దాతలు.. రవాణా సౌకర్యంలో ఇబ్బందులుంటే పోలీసుల సేవలను ఉపయోగించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:హెచ్‌సీయూలోనూ కరోనా నిర్ధరణ పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details