తెలంగాణ

telangana

ETV Bharat / city

బ్లడ్​ బ్యాంక్ నిర్లక్ష్యం.. తలసేమియా చిన్నారికి హెచ్​ఐవీ..!

blood bank negligence: మూడేళ్ల చిన్నారికి మోయలేని కష్టం వచ్చిపడింది. పుట్టినప్పటి నుంచే తలసేమియాతో బాధపడుతున్న ఆ చిన్నారికి 15 రోజులకోసారి రక్తం ఎక్కిస్తూ.. తల్లిదండ్రులు మూడేళ్లుగా కష్టపడుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో పిడుగులాంటి వార్త ఆ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. వైద్యుల సలహామేరకు రక్తపరీక్ష చేపించగా.. అందులో హెచ్​ఐవీ ఉన్నట్టు తేలింది.

HIV Possitive to thalassemia effected 3 Years Boy in nallakunta
HIV Possitive to thalassemia effected 3 Years Boy in nallakunta

By

Published : Aug 9, 2022, 6:07 PM IST

blood bank negligence: తలసేమియాతో బాధపడుతున్న ఓ బాలుడికి హెచ్​ఐవీ పాజిటివ్​గా తేలటం ఇప్పుడు కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా రాంపల్లి గ్రామానికి చెందిన శివకు 2017లో వివాహమైంది. 2019లో ఆ దంపతులకు బాబు జన్మించగా.. ఆ చిన్నారి పుట్టుకతోనే తలసేమియాతో బాధపడుతున్నాడు. కాగా.. నిలోఫర్ వైద్యుల సూచనల మేరకు బాలుడికి 7 నెలలున్నప్పటి నుంచి ప్రతి 15 రోజులకోసారి రక్తం ఎక్కిస్తునే ఉన్నారు. ప్రతీసారి నల్లకుంటలోని రెడ్​క్రాస్ బ్లడ్ బ్యాంకులో రక్తం ఎక్కిస్తుండగా.. ఇటీవల జూలై 20న కూడా బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ చేశారు.

ఈసారి మాత్రం వైద్యులకు ఎందుకో కాస్త అనుమానం వచ్చింది. చిన్నారికి రక్తపరీక్ష చేయించండని తల్లిదండ్రులకు సూచించారు. వెంటనే చిన్నారికి రక్తపరీక్ష చేపించారు. అందులో.. ఆ బాలుడికి హెచ్​ఐవీ పాజిటివ్​ అని తేలింది. ఆ ఫలితం తేలగానే.. కాలయాపన చేయకుండా తల్లిదండ్రులు కూడా టెస్ట్​ చేపించుకున్నారు. వాళ్లిద్దరికి హెచ్​ఐవీ నెగెటివ్ అనే​ వచ్చింది. తామిద్దరిలో ఎవరికీ పాజిటివ్​ లేకుండా కుమారునికి హెచ్​ఐవీ ఉన్నట్టు రావటంపై తల్లిద్రండులకు అనుమానం వచ్చింది. లోతుగా ఆలోచించగా.. బ్లడ్​ బ్యాంకులో హెచ్​ఐవీ ఉన్న రక్తం ఎక్కించటం వల్లే ఇలా జరిగిందని తల్లిదండ్రులు నిర్ధరణకు వచ్చారు. బ్లడ్​ బ్యాంకు సంస్థ నిర్లక్ష్యం వల్లే తమ కుమారునికి హెచ్​ఐవీ సోకిందని ఆరోపిస్తూ.. పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బ్లడ్​ బ్యాంక్​ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా పోలీసులు సెక్షన్-338(Negligence) కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

"బాబు పుట్టినప్పటి నుంచే తలసేమియాతో బాధపడుతున్నడు. నిలోఫర్ వైద్యుల సూచనల మేరకు.. బాబు 7 నెలలు ఉన్నప్పటి నుంచి నల్లకుంటలోని రెడ్​క్రాస్ బ్లడ్ బ్యాంకు​లో రక్తం ఎక్కిస్తున్నాం. ప్రస్తుతం బాబుకు మూడేళ్లు. ప్రతి 15 రోజులకోసారి బ్లడ్ ఎక్కిస్తున్నాం. జూలై 20న కూడా బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ చేశాం. ఆ తర్వాత డాక్టర్ సలహాతో బ్లడ్ టెస్ట్ చేపిస్తే.. హెచ్ఐవీ నిర్ధరణ అయింది. రెడ్​క్రాస్ బ్లడ్ బ్యాంకులో రక్తం ఎక్కించిన తర్వాతే బాబుకు హెచ్​ఐవీ పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చారు. నేను, నా భార్య హెచ్​ఐవీ పరీక్ష చేయించాం. మాకు నెగిటివ్ వచ్చింది. గతంలోలేని వైరస్ ఇప్పుడు ఎలా వచ్చింది. జూలై 30న నల్లకుంట పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాం. దీనిపై పూర్తి దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలి. మాలాగా ఎవరికి అన్యాయం జరగకూడదు. పోలీసులు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం." - శివ, బాలుడి తండ్రి

ఈ ఘటనపై రెడ్​క్రాస్​ బ్లడ్​ బ్యాంక్​ డైరెక్టర్​ బిచ్చిరెడ్డి స్పందించారు. ఇది తాము కావాలని చేసిన తప్పిందం కాదని స్పష్టం చేశారు. ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించలేదన్నారు. బాలుడికి 42 సార్లు రక్తం ఎక్కించగా.. దాతలందరి వివరాలు పోలీసులకు అందజేశాం. భవిష్యత్తులో బాలుడికి తమ బ్లడ్ బ్యాంక్ తరఫున వైద్యానికి అన్ని మద్దతు అందిస్తామని బిచ్చిరెడ్డి హామీ ఇచ్చారు.

"ఇదేమి మేము కావాలని చేసిన తప్పిదం కాదు. ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించలేదు. బాలుడికి హెచ్ఐవీ పాజిటివ్ అన్న సంగతి తల్లిదండ్రులకు మేమే తెలియజేసి జాగ్రత్త పడాలని సూచించాం. బాలుడు హెచ్ఐవీ పాజిటివ్ అన్న సంగతి తెలిపాక కూడా.. బాలుడికి బ్లడ్ ఎక్కించాం. ఇప్పటివరకు బాలుడికి నలభై రెండు సార్లు బ్లడ్ ఎక్కించాం. రక్తం ఇచ్చిన దాతల వివరాలన్ని పోలీసులకు ఇచ్చాం. భవిష్యత్తులో బాలుడికి మా బ్లడ్ బ్యాంక్ సొసైటీ తరఫున వైద్యానికి అన్ని సహాయ సహకారాలు అందజేస్తాం" - బిచ్చిరెడ్డి, నల్లకుంట రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్

మూడేళ్ల చిన్నారికి మోయలేని కష్టం.. అసలే తలసేమియా.. ఇప్పుడు హెచ్​ఐవీ..!

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details