తెలంగాణ

telangana

ETV Bharat / city

దంతాలపై బ్లాక్​ఫంగస్ దాడి.. అప్రమత్తతే దీనికి రెమెడీ - black fungus on tooth

కరోనా సోకిన వారికి దంత సమస్యలు వెంటాడనున్నాయి. తాజా అధ్యయనంలో కొవిడ్ చికిత్సలో ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడిన వారికి బ్లాక్ ఫంగస్​తో ముప్పు పొంచి ఉండనుందని వైద్యులు చెబుతున్నారు. వైరస్​ను జయించిన అనంతరం దవడల నొప్పి, పళ్ల చిగుళ్ల వాపు, చీము, రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే బ్లాక్‌ ఫంగస్‌గా గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

black fungus, black fungus effect on teeth
బ్లాక్ ఫంగస్, దంతాలపై బ్లాక్ ఫంగస్ దాడి

By

Published : Jun 20, 2021, 7:18 AM IST

కొవిడ్‌ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్‌లు వాడిన వారిలో వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత దవడల నొప్పి, పళ్ల చిగుళ్ల వాపు, చీము, రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే బ్లాక్‌ ఫంగస్‌గా అనుమానించాలని విజయవాడకు చెందిన దంత వైద్యుడు, శస్త్ర చికిత్స నిపుణుడు ఎ.శ్రీధర్‌రెడ్డి చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో కరోనా వైరస్‌వల్ల దంతాలకు రక్త సరఫరా జరిగే నాళాల్లోనూ క్లాట్‌లు ఏర్పడటంతో (థ్రాంబోసిస్‌) రక్త సరఫరా నిలిచిపోయి నెర్కోసిస్‌కు (కణజాలం చనిపోవడం) దారి తీస్తోందని, ఆ తర్వాత అక్కడ ఫంగస్‌ దాడి చేస్తోందని వివరించారు.

బయాప్సీలో నెగిటివ్‌ వచ్చినా..!

39ఏళ్ల ఒక వ్యక్తికి ఏప్రిల్‌ 17న కరోనా సోకింది. 21న ఆసుపత్రిలో చేరి 26 వరకు చికిత్స పొందారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు, డిశ్ఛార్జయిన తర్వాత కొన్నాళ్లపాటు చికిత్సలో భాగంగా స్టెరాయిడ్‌లు వినియోగించారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత సైనసైటిస్‌ లక్షణాలు కనిపించడంతో ఈఎన్‌టీ సర్జన్‌ను కలిశారు. బ్లాక్‌ఫంగస్‌ అనుమానంతో ఆయన ఎండోస్కోపీ చేశారు. సైనస్‌ నుంచి టిష్యూ తీసి బయాప్సీకి పంపించారు. ఫలితం ‘నెగిటివ్‌’ అని వచ్చింది. అది బ్లాక్‌ఫంగస్‌ కాదని, సైనసైటిస్‌కు మందులిచ్చి పంపేశారు.

ఆ తర్వాత ఆయనకు చిగుళ్ల వాపు మొదలైంది. సుమారు 15 రోజులు చిగుళ్ల వాపుతో బాధపడిన ఆయన సమస్య తీవ్రమవడంతో దంత వైద్యుల్ని కలిశారు. సీటీ-స్కాన్‌ చేసి చూస్తే.. పై దవడ ముందు భాగంలో ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా ఉందని, నెర్కోసిస్‌తో కణజాలం తీవ్రంగా దెబ్బతినడంతో పాటు ఎముకనూ చాలా వరకు ఫంగస్‌ తినేసిందని గుర్తించారు. సైనస్‌లలోనూ కొంత ఇన్‌ఫెక్షన్‌ కనిపించింది. ఫంగస్‌ వల్ల కుళ్లిపోయిన ప్రాంతంలోని కణజాలం మొత్తాన్ని తీసేయాలని, దెబ్బతిన్న ఎముక భాగాన్ని తొలగించాలని శ్రీధర్‌రెడ్డి తెలిపారు. 8 నుంచి 10 పళ్లు తొలగించాల్సి ఉంటుందన్నారు.

పై దవడలో రావడం అరుదు..

‘సాధారణంగా పై దవడ భాగంలో రక్త ప్రసరణ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కణజాలం కుళ్లిపోయే అవకాశాలు తక్కువ. కొవిడ్‌ చికిత్సలో స్టెరాయిడ్‌లు ఎక్కువగా వాడిన వారిలో, చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్న వారిలో ఈ సమస్యలు కనిపిస్తున్నాయి. సైనస్‌లు వెనుక దంతాల పైభాగంలో ఉంటాయి. కొందరికి దంతాలు సైనస్‌లలోకి ఉంటాయి. అవన్నీ ఒక దానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి కాబట్టి.. సైనస్‌లపై బ్లాక్‌ఫంగస్‌ దాడి చేస్తే అది దంతాలకూ వ్యాపించే అవకాశముంటుంది’

- శ్రీధర్‌రెడ్డి, దంత వైద్యుడు, శస్త్ర చికిత్స నిపుణుడు

ABOUT THE AUTHOR

...view details