బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు నోడల్ కేంద్రంగా ఈఎన్‌టీ ఆస్పత్రి
16:53 May 15
బ్లాక్ ఫంగస్ నిర్ధరణ అయిన కరోనా బాధితులకు గాంధీలో చికిత్స
రాష్ట్రంలో క్రమంగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్స కోసం కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిని నోడల్ కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ బారిన పడి... కొవిడ్ పాజిటివ్‌గా ఉన్న వారికి గాంధీలో చికిత్స అందించనునట్టు పేర్కొంది. ఫంగస్ సోకిన వారికి కంటి సమస్యలు తలెత్తితే సరోజిని దేవి ఆసుపత్రి వైద్యుల సహకారం తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు గాంధీ, సరోజినీ దేవి, కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు సమన్వయంతో పని చేయాలని సూచించింది.
మరోవైపు బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమైన మందులు సమకూర్చుకోవాలని టీఎస్ఎంఐడీసీని ఆదేశించింది. మరోవైపు కొవిడ్ సోకిన వారిలో ఎక్కువగా ఫంగస్ బారిన పడుతున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందించేటప్పడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వైరస్ సోకిన వారికి సరైన సమయంలో స్టిరాయిడ్లు, యాంటీ బయోటిక్స్, యాంటీ ఫంగల్ మందులు ఇవ్వడమే కాకుండా... షుగర్ లెవల్స్‌ని నియంత్రించడం, ఆక్సిజన్ థెరపీ ఇచ్చేటప్పుడు స్టేరైల్ నీటిని మాత్రమే వాడాలని తెలిపింది. బ్లాక్ ఫంగస్ రాకుండా ప్రభుత్వం సూచించిన ఆదేశాలు తప్పక పాటించాలని స్పష్టం చేసింది.