కరోనా రెండో దశ ఇప్పటికీ ప్రజలను వణికిస్తుంటే.. మ్యుకార్‌మైకోసిస్ అనే ఫంగల్ ఇన్‌ఫెక్షన్ మరింత భయాందోళనకు గురిచేస్తోంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కనిపించే ఈ వ్యాధి.. ఇప్పుడు అనేక మందిలో కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ బ్లాక్ ఫంగస్ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు 1,179 మంది దీని బారినపడ్డారు. కరోనా చికిత్సలో ఎక్కువ స్టెరాయిడ్లు వాడిన వారు ఈ వ్యాధి బారినపడ్డారని గతంలో నిపుణులు చెప్పారు. కానీ కరోనా నిర్ధరణ కాకపోయినా.. ఎలాంటి స్టెరాయిడ్లు వినియోగించని వారిలోనూ బ్లాక్‌ఫంగస్ సోకినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రకటించడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
కృష్ణా జిల్లాలోనూ బ్లాక్‌ఫంగస్ కేసులు గుబులు రేపుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని బాధితులకు కాకినాడ జీజీహెచ్‌లో మాత్రమే ఈ వ్యాధికి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు 100 మందికి పైగా రోగులు బ్లాక్‌ఫంగస్‌తో ఆస్పత్రిలో చేరారు. వీరిలో ప్రస్తుతం 68 మంది జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఆరుగురు రోగులు బ్లాక్‌ఫంగస్‌తో చనిపోయారు. వైద్య నిపుణుల బృందం పరిశీలన అనంతరం మాత్రమే ప్రత్యేక ఔషధాలు వినియోగించాలని బాధితులకు వైద్యులు చెబుతున్నారు.