తెలంగాణ

telangana

ETV Bharat / city

మిషన్‌ తెలంగాణ.. 2024లో అధికారమే భాజపా అజెండా - తెలంగాణలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు

BJP's Mission Telangana : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భాజపా పావులు కదుపుతోంది. ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తూ ప్రజలను కమలదళం వైపు ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర ప్రజలను పూర్తిగా భాజపావైపు తిప్పుకునేందుకు జాతీయ కార్యవర్గ సమావేశాలను వేదిక చేసుకోవాలని ప్రణాళికలు రూపొందించింది. తన బలం, బలగాన్ని కార్యవర్గ సమావేశాలు జరిగే హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం చేయకుండా...రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు తరలిస్తోంది.

BJP's Mission Telangana
BJP's Mission Telangana

By

Published : Jul 1, 2022, 9:16 AM IST

BJP's Mission Telangana : దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలో బలంగా విస్తరించాలన్న జాతీయ నాయకత్వ వ్యూహం.. రాష్ట్రంలో అధికారం చేపట్టాలన్న స్థానిక నేతల లక్ష్యం.. వెరసి రాష్ట్రంపై కాషాయదళం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకు జాతీయ కార్యవర్గ సమావేశాలను వేదికగా చేసుకోవాలని ప్రణాళికలు రూపొందించింది. తెరాసకు రాష్ట్రంలో పోటీ ఇవ్వగలిగింది కాంగ్రెస్‌ కాదు తామే అన్న అభిప్రాయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కనిపిస్తోంది.

యువత ద్వారా ఎనిమిదేళ్ల మోదీ పాలన, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లనుంది. దీంతో పాటు తెరాస ప్రభుత్వ పాలనలో అక్రమాలు జరిగాయని చెబుతోన్న భాజపా.. పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించింది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం, ఉద్యమకారులు ఆశించిన తెలంగాణ, ఎనిమిదేళ్ల తెరాస పాలనపై సమావేశాల్లో తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి సాధ్యమని చెప్పడం ద్వారా తెలంగాణలో అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసుకోవాలని భాజపా భావిస్తోంది. అందుకే తన బలం, బలగాన్ని కార్యవర్గ సమావేశాలు జరిగే హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం చేయకుండా...రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు తరలిస్తోంది.

జులై 2 వరకు 119 నియోజకవర్గాలకు 119 మంది జాతీయ స్థాయి నేతలు వెళ్లి.. మోదీ సభతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టేలా కార్యాచరణ రూపొందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు అప్పుడప్పుడు ఈ నేతలు ఆయా నియోజకవర్గాలకు వెళ్లేలా పార్టీ కసరత్తు చేస్తోంది. బలమైన జాతీయ నాయకత్వాన్ని ముందుంచి రాష్ట్రంలో బలపడాలని యోచిస్తోంది.

జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీతో పాటు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌గడ్కరీ వంటి అగ్రనేతలు..18 రాష్ట్రాల సీఎంలు రావడం.. అన్ని నియోజకవర్గాలకు జాతీయ స్థాయి నాయకుల్ని పంపడం ద్వారా రాష్ట్రంలో పార్టీ బలపడుతుందని రాష్ట్ర నాయకత్వం విశ్వసిస్తోంది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, కేంద్ర మంత్రులు హైదరాబాద్‌లోని ఇతర రాష్ట్రాల వారితో సమావేశమయ్యేలా పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.

రాష్ట్ర నేతలకు గుర్తింపు..ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న కాషాయదళం..తాజాగా ఈశాన్య రాష్ట్రాల్లోనూ సత్తాచాటింది. దక్షిణాదిన కర్ణాటక మినహా మిగతా చోట్ల బలహీనంగా ఉంది. అయితే రాష్ట్రంలో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాలు..గోషామహల్‌, దుబ్బాక, హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానాలు, జీహెచ్‌ఎంసీలో గణనీయ సంఖ్యలో కార్పొరేటర్లను గెలిపించుకున్న భాజపా తన బలాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించింది. గెలిచిన నలుగురు ఎంపీల్లో సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. కిషన్‌రెడ్డికి కేంద్ర క్యాబినెట్‌లో అవకాశం కల్పించిన భాజపా నాయకత్వం సీనియర్‌ నేత లక్ష్మణ్‌ను రాజ్యసభకు పంపింది. తెరాస నుంచి పార్టీలో చేరిన ఈటల రాజేందర్‌ను జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంది. అదే సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్‌ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆయన రెండు విడతలు పాదయాత్ర పూర్తిచేశారు. అసెంబ్లీ ఎన్నికల వరకు మరికొన్ని విడతలకు సిద్ధమవుతున్నారు.

అప్నా బూత్‌ -సబ్‌ సే మజ్బూత్‌..కార్యవర్గ సమావేశాల సందర్భంగా 119 మంది నేతలు అన్ని నియోజకవర్గాలకు వెళ్తున్నారు. బస చేస్తున్నారు. వచ్చే ఏడాది శాసనసభ, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల గురించి చర్చకు పెట్టడం ద్వారా ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తపరచడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ఈ సమావేశాల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో కూడా యువమోర్చా, మహిళా, కిసాన్‌, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మోర్చా కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. నియోజకవర్గాలకు వెళ్లే నాయకులు సంఘ్‌ కార్యాలయాలకు వెళ్లి వారితో చర్చించడం, వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది.

రానున్న రోజుల్లో అనుబంధ సంఘాల వారీగా చేయాల్సిన పనుల లక్ష్యాన్ని కూడా నిర్దేశిస్తోంది. నియోజకవర్గాల్లో వివిధ వర్గాలతో జరిగే సమావేశాలు సరిగా జరిగాయా లేదా.. పార్టీ అనుబంధ సంఘాల్లోని సభ్యులందరూ హాజరయ్యారా లేదా అన్నది నిర్ధారించుకోవడానికి సమావేశంలో పాల్గొన్న ప్రతిఒక్కరూ ఒక ఫోన్‌ నంబరుకు మిస్డ్‌కాల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా పూర్తి స్థాయి సమాచారం పార్టీ వద్ద ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు. బూత్‌ల వారీగా కార్యకర్తలకు ప్రత్యేక ఫారం ఇచ్చి వారి పరిధికి సంబంధించిన సమాచారం తీసుకోవడంతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అప్నా బూత్‌ -సబ్‌ సే మజ్బూత్‌( మన బూత్‌- అన్నింటికన్నా పటిష్ఠం) అనే రకంగా పని చేయడానికి శ్రేణులను భాజపా సిద్ధం చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details