రాయలసీమ ఎత్తిపోతలు ఆపాలని కేంద్రానికి లేఖ రాసినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. 2020 ఆగస్టు 5న కేంద్రం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిందని చెప్పారు. 2020 ఆగస్టు 5న కావాలనే కేసీఆర్ మంత్రివర్గ సమావేశం పెట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్, జగన్ మధ్య ఉన్న అవగాహన బయటపడుతుందనే కౌన్సిల్ భేటీకి వెళ్లలేదని అన్నారు.
కేసీఆర్ రోజుకోమాట మాట్లాడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. ప్రాజెక్టుల వద్ద పోలీసులను పెట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీమ ఎత్తిపోతల పనులు పూర్తవుతుంటే కేసీఆర్ ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకున్నారని మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టేందుకే ఇద్దరు సీఎంలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో అయోమయం సృష్టించేందుకే కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారన్న బండి సంజయ్.. కేంద్రమంత్రికి సీఎం కేసీఆర్ ఫోన్ చేయడం ఒక జోక్ అని పేర్కొన్నారు. కేసీఆర్ అన్యాయాల కారణంగానే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతోంది దుయ్యబట్టారు. దక్షిణ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని భాజపా సహించదని అన్నారు. ఈ వివాదంపై పోరాటం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.