Bandi letter To KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రైతుల ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందంటూ ప్రధాని మోదీకి కేసీఆర్ రాసిన బహిరంగ లేఖ యావత్తు పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని సంజయ్ మండిపడ్డారు.
317 జీవో సవరణ, ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని నిరుద్యోగుల పక్షాన పోరాడుతుంటే వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. ప్రధానికి లేఖ రాసి, కొత్త డ్రామాలకు తెరదీసినట్లు కనిపిస్తోందని విమర్శించారు. కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలు, నిర్ణయాల వల్ల సంక్రాంతి పండుగ చేసుకోవాల్సిన రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. నేడు కన్నీళ్లతో సకినాల పిండిని తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని సంజయ్ మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే.. కేసీఆర్ లేఖకు స్పందిస్తూ బహిరంగ లేఖ రాసినట్లు సంజయ్ చెప్పారు.
'ఎరువులు ఉచితంగా ఇవ్వాలి..'
ఎరువులు ఉచితంగా ఇస్తామని 2017 ఏప్రిల్ 13న కేసీఆర్ చెప్పారని బండి సంజయ్ అన్నారు. దాని ప్రకారం ఉచితంగా ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల రుణమాఫీని పూర్తిగా అమలుచేయాలని కోరారు. వడ్లు, పత్తి, మొక్కజొన్న సహా రాష్ట్రంలో రైతులు పండించే పంట ఉత్పత్తులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం కేటాయించిన నిధులను తక్షణమే ఖర్చు చేసి రైతుల పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించడం సహా పంటల ప్రణాళికను ప్రకటించాలని కోరారు.
వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీలను తక్షణమే అమలుచేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీమేరకు పాలీహౌజ్ సబ్సిడీని పునరుద్ధరించి.. ఎస్సీ, ఎస్టీ రైతులకు అదనపు పాలీహౌజ్‌ల నిర్మాణానికి ప్రోత్సాహకం అందించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని.. తెలంగాణలోనూ అమలుచేయాలని కోరారు. విత్తన సబ్సిడీని పూర్తిగా అమలు చేసి నకిలీ విత్తనాలను డిమాండ్ చేశారు.