రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని (telangana liberation day) అధికారికంగా నిర్వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని అయన కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (CM KCR) బండి సంజయ్ (Bandi Sanjay) బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రం నిర్మాణానికి స్థలం కేటాయించి కేంద్ర ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సహాయంతో ఆ నిర్మాణం చేపట్టాలన్నారు.
తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రాన్ని యుద్ధ ప్రాతిపదికన 2022 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని సీఎంకు రాసిన లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ విమోచన ఉద్యమం సందర్భంగా రజాకార్ల చేతిలో బలైన వారి కుటుంబాలను ప్రభుత్వం సన్మానం చేసి ఆదుకోవాలన్నారు. ఆనాటి పోరాట చరిత్రను ఆ ఉద్యమంలో పాల్గొన్న మహానీయుల చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. రజాకార్లను తరిమికొట్టిన వీరబైరాన్‌పల్లి, వరంగల్ కోట, రేణికుంట, కడివెండి, కామారెడ్డిగూడెం, పర్కాల, సూర్యాపేట, బీబీనగర్, బాలెంల - పెరుమాండ్ల సంకీస తదితర ప్రాంతాలతోపాటు తెలంగాణ విమోచనోద్యమ ఘట్టాలను పరిరక్షించాలని బండి సంజయ్ (Bandi Sanjay) వివరించారు.
'తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోకపోవడం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఎంతో ప్రాధాన్యత ఉన్న విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్, తెదేపా పట్టించుకోలేదు. ఇప్పుడు తెరాస పట్టించుకోకపోవడంతో నాలుగు కోట్ల మంది ప్రజల గుండెలు గాయపడుతున్నాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కనీసం ఇప్పటికైనా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించండి. ఉద్యమ సమయంలో విమోచన దినోత్సాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసి... మీరు అధికారంలోకి వచ్చి ఏడు ఏళ్లు అయినా ఎందుకు నిర్వహించడం లేదు.'