Bandi Sanjay on kcr: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, తెదేపా పాలనను మించి కేసీఆర్ పాలనలోనే అవినీతి ఎక్కువగా రాజ్యమేలుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. ప్రజలంతా తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపాను ఆదరిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలను, వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలపై నిలదీయాలని శ్రేణులకు సూచించారు.
భాజపా రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర శిక్షకుల శిక్షణా సమావేశం ప్రారంభానికి బండి సంజయ్, ప్రధాన కార్యదర్శులు మంత్రి శ్రీనివాసులు, దుగ్యాల ప్రదీప్ కుమార్, శిక్షణా కమిటీ కన్వీనర్ డా.ఓఎస్రెడ్డి హాజరయ్యారు. వర్చువల్ పద్ధతిలో ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.