తెలంగాణ

telangana

ETV Bharat / city

Bandi sanjay comments on kcr speech: కేసీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్.. - vijayashanthi on cm kcr

మూడు ఎకరాలు ఇవ్వని.. అంబేడ్కర్​ విగ్రహం పెట్టని ముఖ్యమంత్రి దళితులకు క్షమాపణ చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్​ చేశారు. కేసీఆర్​ ప్రెస్​మీట్​లో తనపై చేసిన వ్యాఖ్యలపైనా సంజయ్​ స్పందించారు. తెలంగాణ ప్రజల కోసం తన తల నరుక్కోవడానికి సిద్ధమన్నారు.

Bandi sanjay
Bandi sanjay

By

Published : Nov 9, 2021, 4:49 PM IST

Updated : Nov 9, 2021, 5:56 PM IST

తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క దళితునికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. ప్రతిఒక్కరికీ దళిత బంధు వచ్చేలా తెరాసలో ఉన్న దళిత ప్రజాప్రతినిధులు కృషిచేయాలని సూచించారు. ఎస్సీలు ఓట్లేస్తేనే కేసీఆర్​ సీఎం అయ్యారన్నారు... బండి సంజయ్​. మూడెకరాలు ఇస్తానని, అంబేడ్కర్​ విగ్రహం పెడతానని మోసం చేశారని బండి సంజయ్​ ఆరోపించారు. దళితుడిని సీఎం చేయాల్సిందేనని డిమాండ్​ చేశారు. తన గురువు ఎవరని సీఎం అడిగారని.. కేసీఆరే తన గురువని చెప్పారు.

ఏడేళ్లలో ధాన్యం ఎవరు కొన్నారో చెప్పాలని బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సంజయ్​ ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోళ్లు కేంద్రాల వద్ద అన్నదాతలు అవస్థలు పడుతున్నారన్నారు. వెంటనే వారికి న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

తాను పేదల కోసం కొట్లాడుతున్నానని సంజయ్​ చెప్పారు. కేసీఆర్​ తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని స్పష్టం చేశారు. కేసీఆర్​ తనను ఎన్ని తిట్టిన భయపడనన్నారు. తెలంగాణ ప్రజల కోసం తన తల నరుక్కోవడానికి సిద్ధమన్నారు. తాము త్యాగాలను వెనకాడనన్నారు.

Bandi sanjay comments on kcr speech: కేసీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్..

ప్రతి ఎస్సీ కుటుంబానికి దళిత బంధు కింద 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ... భాజపా 'డప్పు మోత' కార్యక్రమం చేపట్టింది. బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి నివాళులర్పించిన నేతలు... అనంతరం ర్యాలీ ప్రారంభించారు. భాజపా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియం నుంచి డప్పులమోత కార్యక్రమం నిర్వహించారు. ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు భాజపా నేతలు, కార్యకర్తలు డప్పులతో ర్యాలీ చేశారు. రాష్ట్రమంతా దళితబంధు అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమంలో భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్​, రాజాసింగ్, విజయశాంతి పాల్గొన్నారు.

చివరి దెబ్బకు కేసీఆర్​ సిద్ధంగా ఉండాలి: ఈటల

తెలంగాణ ప్రజల చైతన్యాన్ని చవిచూపించిన వారు హుజూరాబాద్​ బిడ్డలను ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ అన్నారు. ఒక్క హుజూరాబాద్​లో దెబ్బకొడితే.. రెండు రోజులు రెండు గంటలపాటు సీఎం మాట్లాడారన్నారు. తెలంగాణ ప్రజలు హుజూరాబాద్​ బిడ్డల స్ఫూర్తి తీసుకొని.. చివరి దెబ్బకొట్టే రోజు తప్పకుండా వస్తుందని ఈటల చెప్పారు. అందుకు కేసీఆర్​ సిద్ధపడాలన్నారు.

కేసీఆర్​ ఒక 'టూరిస్ట్​ సీఎం': విజయశాంతి

కేసీఆర్​కు తాను 'టూరిస్ట్​ సీఎం' అని పేరు పెడుతున్నానన్నారు.. భాజపా నేత విజయశాంతి. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఒకసారి బయటకొచ్చి.. మళ్లీ వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. భాజపా నేతలపై కేసీఆర్ తన​ ప్రెస్​మీట్​లో చేసిన వ్యాఖ్యలపై విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్​, డీజిల్​పై వ్యాట్​ పెంచలేదని కేసీఆర్​ అబద్దాలు చెప్పారని ఆమె ఆరోపించారు. సుమారు గంటన్నర సేపు కేసీఆర్ మాట్లాడారని.. అందులో భాజపా నేతలను తిట్టేందుకే సమయం వెచ్చించారన్నారు. అంతా మాట్లాడాక చివరలో అసలు తెలంగాణలో భాజపానే లేదన్నారని.. మరి గంటరన్నరసేపు ఎవరికోసం మాట్లాడారో చెప్పాలన్నారు... విజయశాంతి. భాజపా అంటేనే సీఎం కేసీఆర్​కు బీపీ పెరుగుతోందన్నారు. ఏడేళ్లుగా సీఎం కేసీఆర్​ అవే మాటలు మాట్లాడుతున్నారని.. తనకు కేసీఆర్​ ఓ కమీడియన్​లా కనిపిస్తున్నారని విజయశాంతి అన్నారు. ఆయన వ్యాఖ్యలను తాము సీరియస్​గా తీసుకోవట్లేదని చెప్పారు. తాము కేసీఆర్​ను టచ్​ చేయమని.. ఆయన అవినీతిని టచ్​ చేస్తామని విజయశాంతి స్పష్టం చేశారు.

ఇవీచూడండి:KTR Fire on BJP: కేసీఆర్ సాఫ్ట్ అనుకుంటున్నారేమో.. లోపల ఒరిజినల్ అట్లనే ఉంది: కేటీఆర్

Last Updated : Nov 9, 2021, 5:56 PM IST

ABOUT THE AUTHOR

...view details