Bandi Sanjay Meets Boora Narasaiah: రాష్ట్ర భవిష్యత్ కోసమే బూర నర్సయ్య గౌడ్ భాజపాలో చేరుతున్నారని ఆ పార్టీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెరాస ఉద్యమ ద్రోహుల పార్టీగా మారితే... భాజపా ఉద్యమకారులతో నిండిపోతోందని పేర్కొన్నారు. ఇటీవల తెరాస సభ్యత్వానికి రాజీనామా చేసిన బూరనర్సయ్య గౌడ్ ఇంటికి వెళ్లి భాజపాలోకి రావాలని ఆహ్వానించారు. పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం నర్సయ్య గౌడ్ ఎంతో కష్టపడ్డారని బండి సంజయ్ తెలిపారు.
ఈ నెల 19న దిల్లీలో భాజపాలో చేరుతున్నట్లు బూరనర్సయ్య గౌడ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెరాస గెలవబోదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను కలవడం తెరాస నేతలకు ఉద్యమంలా మారిందని ఆయన అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే భాజపాలో చేరుతున్నానని తెలిపారు. దిల్లీలోని కేంద్ర కార్యాలయంలో చేరిక ఉంటుందని వ్యాఖ్యానించారు.
'రాష్ట్ర భవిష్యత్ కోసమే నర్సయ్య భాజపాలో చేరుతున్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌కు కేంద్రం ఇచ్చిన నిధులపై స్పష్టత ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు సీఎం కేసీఆర్ ఇవ్వడం లేదు. నర్సయ్య గౌడ్ చేరికతో మునుగోడులో భాజపా గెలుపు ఖాయం. నర్సయ్య గౌడ్‌ను మోదీ గుర్తించారు, కేసీఆర్ దగ్గరికి కూడా తీసుకోలేదు. మునుగోడులో ఒక గ్రామానికి సీఎంను ఇన్‌ఛార్జిగా పెట్టిన ఘనత భాజపాది'- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు