Bandi Sanjay Comments: రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చి మైనర్పై అత్యాచారానికి పాల్పడ్డ నిర్మల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షాజీద్ ఖాన్ను ఇంతవరకు అరెస్టు చేయకపోవడం దారుణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. తెరాస పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని విరుచుకుపడ్డారు. బాలికలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టి మూడురోజులైనా అరెస్టు చేయకపోగా... దోషిగా తేలితేనే పార్టీ నుంచి బహిష్కరిస్తామనడం సిగ్గు చేటన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగానికి అభం శుభం తెలియని బాలికలు బలవుతున్నారన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పనిచేయాల్సిన పోలీసులు.. తెరాస కార్యకర్తలకు భయపడుతుండటం బాధాకరమన్నారు. అధికార పార్టీ రాక్షస క్రీడలో పోలీసులు భాగం కావొద్దని హితవు పలికారు.
వెంటనే అరెస్ట్ చేయాలి..
"తెరాస నేతల తీరు చూస్తుంటే అరాచకాలను సమర్థిస్తున్నారని అర్థమవుతోంది. తెరాస మార్క్ పాలన సెక్యూలరిజానికి పరాకాష్ట. ఆనాడు రజాకార్లు మహిళలను చెరుపుతుంటే నిజాం రాజు మౌనం వహించినట్టే.. ఈనాడు తెరాస నేతలు బాలికలను, మహిళలను చెరుపుతుంటే.. నయా నిజాం కేసీఆర్ కూడా ప్రేక్షక పాత్ర పోషించటం హేయనీయం. మానవ మృగాన్ని పార్టీ నుంచి బహిష్కరించే సాహసం చేయలేకపోవడం అత్యంత దారుణం. తెరాస పాలనలో ఇలాంటి సంఘటనలు కొన్ని మాత్రమే వెలుగు చూశాయి. వెలుగు చూడని ఘటనలు కోకొల్లలు. గతంలోనూ.. హైదరాబాద్ నడిబొడ్డున చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలో హోంమంత్రి నివాసానికి సమీపంలోనే ఓ దళిత మహిళపై ఎంఐఎం నేత అత్యాచారం చేస్తే.. ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించింది తప్ప.. కేసు కూడా నమోదు చేయలేదు. ఇప్పుడు కూడా అలాంటిదే జరుగుతోంది. ఇప్పటికైనా పోలీసులు దృష్టిసారించి.. తక్షణమే బాధ్యుడిని అరెస్టు చేయాలి. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి."- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చూడండి: