రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామయాత్రకు శ్రీకారం చుట్టారు. తెరాస ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టే విధంగా పాదయాత్రకు పూనుకున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు.
ప్రసంగం అనంతరం పాదయాత్ర
తొలుత ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన అక్కడి నుంచి అమ్మవారి దేవాలయానికి వెళ్లారు. చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ శంఖం పూరించారు. ప్రసంగం అనంతరం పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్, డీకే అరుణ, అర్వింద్, విజయ శాంతి, వివేక్ పాల్గొన్నారు.
భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో బండి సంజయ్ పూజలు పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా
తెరాస ప్రభుత్వ ప్రజావ్యతిరేక, నిరంకుశ విధానాలను, కుటుంబ పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే సంస్థాగతంగా పార్టీని బలోపేతంచేస్తూ 2023లో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా... ప్రజా సంగ్రామ యాత్ర సాగనుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ యాత్ర విజయవంతానికి రాష్ట్ర నాయకత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. పాదయాత్ర విజయవంతానికి 29 కమిటీలు ఏర్పాటు చేశారు. సీనియర్ నేతలతోపాటు పాత, కొత్త నాయకులకు బాధ్యతలు అప్పగించారు.
అక్టోబర్ 2న ముగియనున్న పాదయాత్ర
తొలి రోజు పాదయాత్ర అఫ్జల్‌గంజ్, నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం, లక్డీకాపూల్ మీదుగా మెహిదీపట్నం వరకు సాగుతుంది. మెహిదీపట్నం పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో ఈ రోజు రాత్రి బస చేయనున్నారు. రోజుకు సగటున 10 నుంచి 15 కిలోమీటర్ల చొప్పున 35 రోజులపాటు సాగనుంది. అక్టోబర్ 2న.... హుజూరాబాద్ సభతో తొలివిడత ప్రజా సంగ్రామ యాత్ర ముగుస్తుంది. ఆ లోపు హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడితే పాదయాత్ర రూట్‌మ్యాప్ మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2023 ఎన్నికల వరకు విడతల వారీగా ప్రజాసంగ్రామ యాత్రను చేపట్టనున్నట్లు భాజపా నేతలు వెల్లడించారు.
ఇదీ చదవండి :Tollywood drugs case: ఏ దేశానికి ఎంత మళ్లించారు?