Bandi Sanjay Comments: గోల్కొండ ఖిల్లా మీద కాషాయ జెండాను ఎగరేయటం ఖాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేసేందుకే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ వచ్చారని ఉద్ఘాటించారు. ప్రజాసంగ్రామయాత్ర రెండో విడత ముగింపు సభలో ప్రసంగించిన బండి సంజయ్.. తెరాస ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని పంచభూతాలను సైతం మూర్ఖత్వపు తెరాస ప్రభుత్వం మింగేసిందని నిప్పులు చెరిగారు. నిజాం, ఔరంగజేబు సమాధులకు మోకరిల్లే వాళ్లకు తెలంగాణ గడ్డపై స్థానం లేదని దుయ్యబట్టారు. తెరాస, ఎంఐఎం, కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. తెరాసకు వేసినట్లేనని ఆక్షేపించారు. తెలంగాణలో కుటుంబ పాలనను అంతమొందించాలని.. అందుకోసం భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ఎక్కడకు పోయినా సమస్యలే స్వాగతం పలికాయని సంజయ్ తెలిపారు. ప్రతీ చోట కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకత ఎదురైందన్న సంజయ్.. అధికార మార్పు జరగాలని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర నడిచింది తానే అయినా.. నడిపించింది మాత్రం కార్యకర్తలేనని సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో వెంటనే ఎన్నికలు రావాలని కోరుకుంటున్నానని బండి సంజయ్ తెలిపారు. ఎన్నికలు అధికారం కోసం కాదని.. మోసపోతున్న తెలంగాణ ప్రజలను కల్వకుంట్ల కుటుంబం నుంచి కాపాడి ప్రజాస్వామ్య పాలన ఇచ్చేందుకేనని స్పష్టం చేశారు.