Bandi Sanjay Comments: జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో నిందితులపై కేసు నమోదు చేయని పోలీసులు.. న్యాయం చేయాలని ఉద్యమిస్తున్న ఎమ్మెల్యే రఘునందన్‌పై కేసు పెట్టడం సిగ్గుచేటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. అత్యాచార ఘటనలో ఆధారాలు ఉన్నా.. దోషులను అరెస్టు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస, మజ్లిస్ నేతల ప్రమేయం ఉన్నందునే కేసును ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని సంజయ్ ఆరోపించారు.
ఈ తరహా ఘటనలు రోజుకోకటి వెలుగు చూడటం.. హైదరాబాద్లో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి నిదర్శనమని బండి సంజయ్ ఆక్షేపించారు. నేరాలను అరికట్టడంలో తామే నంబర్ వన్ అంటూ గొప్పలు చెప్పుకునే సీఎం కేసీఆర్, కేటీఆర్ గొంతు ఎందుకు మూగబోయిందని ప్రశ్నించారు. ఈ ఘటనలపై స్పందించరా? అని నిలదీశారు. ప్రభుత్వం చేసే తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని.. అసలైన దోషులను శిక్షించే వరకు భాజపా ఉద్యమిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.