కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన కార్మికులు లాక్డౌన్ కారణంగా కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ వద్ద నివసిస్తున్న సంఘటన చూసి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చలించిపోయారు. వారికి 20 రోజులకు సరిపడా 11 రకాల నిత్యావసర సరుకులు అందించారు.
తెలంగాణలోని ప్రతిఒక్కరినీ ఆదుకుంటాం: బండి సంజయ్ - భాజపా
తెలంగాణలో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ భాజపా కార్యకర్తలు ఆదుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ సూచించారు. గుల్బర్గా కార్మికులు కరీంనగర్లో చిక్కుకోవడం వల్ల ఆయన చలించిపోయారు.
కరోనా నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలను వారికి వివరిస్తూ, ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి సహకరిస్తానని పేర్కొన్నారు. లాక్డౌన్ ముగిసే వరకు ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధమని తెలిపారు.
ప్రభుత్వం కల్పించిన అత్యవసర సరుకుల సేకరణ నిమిత్తం బయటకు వచ్చే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బయటకు వచ్చినప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని... ఇంటికి వెళ్లాక చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు తమను తాము రక్షించుకుంటూనే దేశాన్ని రక్షించడానికి లాక్‌డౌన్‌ను పాటించాలని అన్నారు.