లక్షల కోట్ల అప్పులతో ఏపీ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి అన్నారు. వైకాపా ప్రభుత్వంలో పాలకులు స్వలాభం కోసం పాలన సాగిస్తున్నారే తప్ప.. సుపరిపాలన కాదని ఎద్దేవా చేశారు. విశాఖ జిల్లా బుషికొండ ఏవన్ గ్రాండ్లో జరిగిన జిల్లా భాజపా శక్తి కేంద్ర ప్రముఖ్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
వైకాపా రెండున్నరేళ్ల పాలనలో ఆరు లక్షల కోట్ల అప్పు చేసిందని పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డపై రూ.1.20 లక్షల అప్పు ఉందని అన్నారు. వైకాపా ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసి.., ఎక్కడ అప్పు దొరుకుతుందా అనే వెతుకులాటలో ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధికి నిధులు మంజూరు చేయటం లేదని భాజపాపై దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఆక్షేపించారు. కేంద్రం ఇస్తే గానీ రాష్ట్రంలో పూటగడవని పరిస్థితి ఉందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో రహదారులతో పాటు అనేక సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు మంజూరు చేసిందని అన్నారు. వైకాపా ప్రభుత్వం మాత్రం తమ స్వలాభం కోసం పాలన కొనసాగిస్తూ.. రాష్ట్రంలోని భూములను తాకట్టుపెడుతోందని దుయ్యబట్టారు. కనుక ఈ రాష్ట్రానికి ఒక కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని అన్నారు.