రాష్ట్రంలో త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, పట్టభద్రుల స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కమలనాథులు పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే.. తెరాస ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని భాజపా రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. రెండు పట్టభద్రుల స్థానాల్లో ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానం భాజపా సిట్టింగ్ స్థానం కాగా వరంగల్, ఖమ్మం,నల్గొండ కూడా పట్టున్న స్థానమే. గతంలో ఈ స్థానం నుంచి భాజపా అభ్యర్థి రాజేశ్వరరావు ఎమ్మెల్సీగా విజయం సాధించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ నుంచి పోటీ చేసేందుకు భాజపా నేతలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు.
కోదండరాంకు దీటుగా
భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, చందుపట్ల కీర్తిరెడ్డితో పాటు మరికొంత మంది నేతలు పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ స్థానం నుంచి తెరాస సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తిరిగి బరిలో నిలుస్తారని ముందు నుంచే తెరాస వర్గాలు చెబుతూ వచ్చాయి. అనూహ్యాంగా ఇదే స్థానం నుంచి ఉద్యమకారుడు, తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం సైతం పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో తెరాస డైలమాలో పడినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కోదండరాంను ఎదుర్కొనేందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహారిని పోటీకి దించాలని తెరాస భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో భాజపా రాష్ట్ర నాయకత్వం అధికార పార్టీ అభ్యర్థితో పాటు కోదండరాంను ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడికే అవకాశం ఇవ్వాలని భావిస్తోంది.
సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకే మరో అవకాశం..
రెండో పట్టభద్రుల స్థానమైన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ సీటు ప్రస్తుతం భాజపా ఖాతాలోనే ఉంది. ఇక్కడి నుంచి రాంచందర్‌రావు ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ సీటును కాపాడుకోవడమే గాక వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం కైవసం చేసుకునేలా కమలనాథులు వ్యూహాలు పన్నుతున్నారు. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి పోటీ చేస్తానని పార్టీకి చెందిన నేతలెవ్వరూ ముందుకు రాలేదు. జాతీయ నాయకత్వం తనకే పోటీ చేసేందుకు సంకేతం ఇచ్చిందని స్వయంగా రాంచందర్ రావు వెల్లడించారు. ఈ ఆరేళ్ల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను మండలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని.. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన పట్టభద్రులను అభ్యర్థిస్తున్నారు.
ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు భాజపా ఎత్తుగడలు బరిలో ప్రొ.నాగేశ్వర్
వారం రోజుల్లో రెండు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను భాజపా ప్రకటించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఇక్కడి నుంచి గతంలో ఎమ్మెల్సీగా గెలుపొందిన ప్రొఫెసర్ నాగేశ్వర్ వామపక్షాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నుంచి జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ ముగ్గురు బరిలోకి దిగితే.. ప్రధాన పోటీ రాంచందర్ రావు, నాగేశ్వర్ మధ్యే ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో తెరాస బొంతును కాకుండా వేరే వాళ్లను నిలబెట్టాలని సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అధికార, ప్రతిపక్షాలు ఎత్తకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి.
ప్రచారానికి రానున్న జాతీయ కమళదళం..
పట్టభద్రుల ఎన్నికల ప్రచారానికి జాతీయ నాయకత్వంతో పాటు కేంద్రమంత్రులు ప్రకాశ్ జావ్దేకర్, రవిశంకర్ ప్రసాద్, కిషన్ రెడ్డితో పాటు మరికొంత మంది రానున్నట్లు కాషాయదళం చెబుతోంది. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి అనేక నిధులు కేటాయించినప్పటికీ తెరాస నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాటిని తిప్పికొట్టేందుకే కేంద్ర మంత్రులు ప్రచారానికి వస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భాజపా నేతలు పావులు కదుపుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో భాజపా కోర్‌కమిటీ సమావేశమై ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ కాషాయజెండా ఎగరవేసేందుకు భాజపా బూత్‌స్థాయి నుంచే పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసింది. జీహెచ్‌ఎంసీ మేయర్ పదవి కైవసం చేసుకునే లక్ష్యంగా పక్కా ప్రణాళికలు రచిస్తోన్న రాష్ట్ర నాయకత్వం భాజపాకు అవకాశం ఇస్తే కేంద్రం సహకారంతో హైదరాబాద్‌ను సుందర నగరంగా తీర్చిదిద్ధుతామనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భావిస్తోంది. ఎన్నికలకు ముందు జరిగే జీహెచ్‌ఎంసీ, పట్టభద్రుల స్థానాల ఎన్నికలను సెమీ ఫైనల్‌గా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న భాజపా ఏ మేరకు ప్రభావం చూపిస్తోందో వేచి చూడాలి.
ఇదీ చూడండి:నవంబరు 3న దుబ్బాక ఉపఎన్నిక