vijaya sai reddy on BJP: రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాకు మా అవసరం ఉందని వైకాపా నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆ పార్టీకి 4% ఓట్ల లోటు ఉంది. వైకాపా మద్దతు తీసుకోకుండా మిగతా పార్టీలతో భాజపా సంప్రదిస్తే.. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అప్పుడు ఆలోచిస్తామని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కోటాలో 4 రాజ్యసభ స్థానాలకు విజయసాయిరెడ్డితో పాటు బీద మస్తాన్‌రావు, ఎస్.నిరంజన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య బుధవారం నామినేషన్లు వేశారు. అసెంబ్లీ భవనంలో ఎన్నికల అధికారి, శాసన మండలి ఉప కార్యదర్శి పీవీ సుబ్బారెడ్డికి వారు నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం సహచరులతో కలిసి అసెంబ్లీలోని వైకాపా శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
‘రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న దానిపై సీఎం జగన్ తగిన నిర్ణయం తీసుకుంటారు. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అయినందున కోవింద్‌కు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చాం. గుజరాత్‌కు చెందిన పరిమళ్ నత్వానీకి గతంలో ఏపీ నుంచి అవకాశం కల్పిస్తే... రాష్ట్ర సమస్యలపై రాజ్యసభలో ఆయన వాణి వినిపించారు. ఇప్పుడు ఆర్.కృష్ణయ్య అదే విధంగా పని చేయనున్నారు. ఆయన బీసీ జాతీయ నాయకుడనే విషయాన్ని గమనించాలి. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైనప్పుడే కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తాం.