భాజపా నేతలపై తెరాస ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను దీటుగా ఎదుర్కొంటామని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పరిణామాలపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్ చుగ్.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఫోన్ చేశారు. భాజపా నేతలపై వచ్చిన ఆరోపణలపై ఆరా తీశారు. తెరాస కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని బండి వివరించినట్లు చెప్పారు. ఈ మేరకు నివేదికను జాతీయ నాయకత్వానికి పంపారు. ఈ నేపథ్యంలో డీకే అరుణ, జితేందర్ రెడ్డితో విడివిడిగా బండి సంజయ్ భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
సీబీఐ విచారణ జరిపించాలి..
మంత్రి హత్యకు కుట్ర కేసులో భాజపా నేతలపై ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి సీబీఐపై నమ్మకం లేకపోతే న్యాయవిచారణ జరిపించాలన్నారు. ఎలాంటి మచ్చ లేని తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు విచారణకు పిలిస్తే తప్పకుండా సహకరిస్తానన్న జితేందర్‌రెడ్డి.. దుబ్బాక, హుజూరాబాద్‌లో భాజపా గెలుపు ఓర్వలేకే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
'తెలంగాణ ఉద్యమ కారులతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ నుంచి కార్యకర్తలు దిల్లీకి వస్తే నా ఇంటికి వచ్చేవారు. ఉద్యమ కారులకు వసతి కల్పించడం నా బాధ్యత. మంత్రి హత్యకు కుట్ర కేసులో భాజపా నేతలపై ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపించాలి.'
- జితేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ