తెలంగాణ

telangana

ETV Bharat / city

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు.. అవే మన లక్ష్యాలు.. - భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల లక్ష్యాలు

BJP national executive meetings: హైదరాబాద్‌లో శనివారం భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ఉదయం పదాధికారుల సమావేశం జరిగింది. సుమారు అయిదుగంటల పాటు జరిగిన ఈ సమావేశంలో 148 మంది పదాధికారులు పాల్గొన్నారు.భాజపా ఎనిమిదేళ్లపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమావేశంలో చర్చించారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, నాగాలాండ్‌లలో విజయమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని అగ్రనేతలు సూచించారు.తెలంగాణలోనూ మంచి వాతావరణం ఉందని, ఉప ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమన్నారు.

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు

By

Published : Jul 3, 2022, 4:12 AM IST

BJP national executive meetings : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వం, పార్టీ విధానాలు తమకు కీలక విజయాలను అందిస్తున్నాయని భారతీయ జనతా పార్టీ పదాధికారులు అభిప్రాయపడ్డారు. భాజపాకు దేశ ప్రజల ఆశీస్సులు బాగా ఉన్నాయని, ఇటీవల జరిగిన ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపుర్‌ రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేయడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. యూపీలో గతంలో ఎన్నడూ గెలవని రాంపుర్‌, ఆజంగఢ్‌లాంటి స్థానాల్లో కూడా భాజపా ఇటీవలి ఉపఎన్నికల్లో గెలవడం మార్పునకు సంకేతమని అన్నారు. భాజపా ఎనిమిదేళ్లపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమావేశంలో చర్చించారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, నాగాలాండ్‌లలో విజయమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని అగ్రనేతలు సూచించారు. హైదరాబాద్‌లో శనివారం ప్రారంభమైన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ఉదయం పదాధికారుల సమావేశం జరిగింది. సుమారు అయిదుగంటల పాటు జరిగిన ఈ సమావేశంలో 148 మంది పదాధికారులు పాల్గొన్నారు.భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సమావేశాన్ని ప్రారంభించారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రతిపాదించాల్సిన రాజకీయ, ఆర్థిక తీర్మానాల ముసాయిదాపై సుదీర్ఘంగా చర్చించారు. దేశంలో ఇటీవలి రాజకీయ పరిణామాలతోపాటు ఉప ఎన్నికలు, రానున్న శాసనసభ ఎన్నికలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛపాలన, గరీబ్‌ కల్యాణ్‌యోజన వంటి పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. శాసనసభ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పోలింగ్‌ బూత్‌లవారీగా పార్టీని బలోపేతం చేయాలని, ఆగస్టు 15లోగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రకటించారు. పశ్చిమబెంగాల్‌, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో భాజపా కార్యకర్తలు అనేక ఇబ్బందులను, వేధింపులను ఎదుర్కొంటూ పార్టీ కోసం పోరాడుతున్నారని ప్రశంసించారు.భాజపాను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై జాతీయ ప్రధానకార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌ వివరించారు. దేశవ్యాప్తంగా 3.40 కోట్ల ఇళ్ల నిర్మాణం, 27 నగరాల్లో మెట్రో రైలు సౌకర్యం, 171 కోట్ల వ్యాక్సినేషన్‌ సహా వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పదాధికారుల సమావేశం అనంతరం భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజేే సింధియా వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఆర్థిక వృద్ధిరేటుతో దేశం దూసుకెళ్తోంది: వసుంధర రాజే

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ, ప్రపంచ సగటు జీడీపీ 6 గా ఉన్నా భారతదేశ జీడీపీ 8.7 శాతం వృద్ధిరేటుతో దూసుకెళ్లడానికి భాజపా ప్రభుత్వమే కారణమని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధర రాజే అన్నారు. ‘‘సమావేశంలో వర్తమాన రాజకీయాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, పేదల సంక్షేమంపై చర్చించాం. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ-పేదల సంక్షేమంపై రెండు తీర్మానాలు చేయనున్నాం.భాజపా నాయకులు బూత్‌స్థాయి కార్యకర్తలతో మాట్లాడి, పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిసారించాలి. నిరంతరం ప్రజలతో చర్చలు నిర్వహించాలి. ఒక్కో బూత్‌లో కనీసం 200 మంది క్రియాశీలక కార్యకర్తలను గుర్తించి, వారిని ఒకవేదికపైగా తీసుకువచ్చేలా వాట్సప్‌ గ్రూపులను ఏర్పాటు చేయనున్నాం. దేశవ్యాప్తంగా పన్నాప్రముఖ్‌లను తయారు చేయనున్నాం. ఈ వ్యవస్థతో భాజపా పటిష్ఠమైంది. దీని పునాదులపైనే పార్టీ, భాజపా ప్రభుత్వాల నిర్మాణం జరిగిందని గుర్తించాలి.

20 కోట్ల కుటుంబాల లక్ష్యంతో ఇంటింటికీ తిరంగా..

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పార్టీ తరఫున వివిధ రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ప్రతిఇంట్లో మూడు రంగుల జెండా లక్ష్యంగా దేశంలో 20 కోట్ల మంది వద్దకు ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. ఇంటింటిపై జెండా ఎగురవేసి దేశ ప్రజలందరినీ ఒక ఉద్యమంలా సంఘటితం చేయాలని నిర్ణయించాం’’ అని వసుంధర రాజే తెలిపారు.

తెలంగాణలో అధికారానికి కృషి

తెలంగాణలోనూ మంచి వాతావరణం ఉందని, ఉప ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని ముఖ్యనేతలు సమావేశంలో పేర్కొన్నారు. మరింత కష్టపడితే అధికారంలోకి వస్తామనే ధీమా ఉందన్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ వేదికైన నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ జాతీయ నేతల ఆశీస్సులతో రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details