తెలంగాణ

telangana

ETV Bharat / city

సస్పెన్షన్‌పై హైకోర్టును ఆశ్రయించిన భాజపా ఎమ్మెల్యేలు - సస్పెన్సన్​పై హైకోర్టులో పిటిషన్​ వేసిన బీజేపీ ఎమ్మెల్యేలు

telangana BJP MLAs
telangana BJP MLAs

By

Published : Mar 8, 2022, 2:39 PM IST

Updated : Mar 8, 2022, 6:10 PM IST

14:38 March 08

సస్పెన్షన్‌పై హైకోర్టును ఆశ్రయించిన భాజపా ఎమ్మెల్యేలు

అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడంపై భాజపా శాసనసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. తమ సస్పెన్షన్ రాజ్యాంగానికి, సభ నియామవళికి విరుద్ధంగా ఉందంటూ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్ పిటిషన్ దాఖలు చేశారు. సస్పెన్షన్ కొట్టివేసి సమావేశాలకు అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని భాజపా ఎమ్మెల్యేలు కోరారు. సస్పెన్షన్ తీర్మానంతో పాటు నిన్నటి సమావేశాల వీడియో రికార్డింగులను తెప్పిచడంతో పాటు తమకూ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని కోరారు.

రాజకీయ వైరుద్ధ్యాల కారణంగా

ముందస్తు ప్రణాళికతో తమను సభ నుంచి సస్పెండ్ చేశారని ఎమ్మెల్యేలు అన్నారు. కేంద్రం, భాజపాలపై రాజకీయ వైరుద్ధ్యాల కారణంగా గవర్నర్​ను సభకు ఆహ్వానించలేదని.. దానిపై నిరసన మాత్రమే వ్యక్తం చేశామని పిటిషన్​లో వివరించారు. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరామని తెలిపారు. స్పీకర్ దృష్టిని ఆకర్షించేందుకు రాజాసింగ్ కొంత ముందుకు వెళ్లారని... సభలో ఇలా అడగటం మొదటిసారేమీ కాదని పేర్కొన్నారు. సభ నడవలేని పరిస్థితి తలెత్తినప్పుడు లేదా స్పీకర్​ను కించపరిచేలా వ్యవహరిస్తే సస్పెండ్ చేయవచ్చునని.. ఆ రెండూ జరగలేదని చెప్పారు.

ముందుగా రాసిచ్చిన తీర్మానం చదివి

స్పీకర్ పేర్కొన్న సభ్యులను మాత్రమే సస్పెండ్ చేయాలన్న నిబంధన పాటించలేదని.. సభాపతి తమను ముందుగా హెచ్చరించలేదని కనీసం పేరు కూడా పలకలేదన్నారు. ఆర్థిక శాఖ మంత్రి అకస్మాత్తుగా ప్రసంగం ఆపడం.. తర్వాత మంత్రి తలసాని... ముందుగా రాసిచ్చిన తీర్మానం చదవడం.. మెజారిటీ ద్వారా ఆమోదం తెలపడం నిమిషాల్లో అయిపోయాయని వివరించారు. మరోవైపు సభను కేవలం ఆరు పని రోజులకే పరిమతం చేశారన్నారు. భాజపా ఎమ్మెల్యేల పిటిషన్​పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

ఇదీ చదవండి :శాసనసభ నుంచి భాజపా సభ్యుల సస్పెన్షన్‌

ఏం జరిగిందంటే..

సోమవారం రోజు శాసన సభలో మంత్రి హరీశ్​రావు బడ్జెట్​ ప్రవేశపెడుతుండగా.. భాజపా సభ్యులు ఈటల రాజేందర్​, రఘునందర్​రావు, రాజాసింగ్.. అడ్డుతగులుతున్నారంటూ వారిని సభ నుంచి సస్పెండ్​ చేశారు. భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్​ చేయాలంటూ.. మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది. దీనిపై స్పీకర్​ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు. ఈ సెషన్​ పూర్తయ్యే వరకు భాజపా సభ్యులను సస్పెండ్​ చేస్తున్నట్లు వెల్లడించారు.

గవర్నర్‌కు వినతిపత్రం

దీనికి నిరసనగా అసెంబ్లీ బయటకొచ్చి ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, రాజాసింగ్‌లను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌ స్టేషనుకు తరలించారు. మధ్యాహ్నం 2 గంటలకు వదిలేశారు. తమను సస్పెండ్‌ చేయడంపై భాజపా ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, రాజేందర్‌, రఘునందన్‌రావుతో పాటు పార్టీ ముఖ్యనేతలు కె.లక్ష్మణ్‌, ఎన్‌.రాంచందర్‌రావు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ‘స్క్రిప్టు ప్రకారమే అధికారపక్షం మమ్మల్ని సస్పెండ్‌ చేసింది. మహారాష్ట్రలో 12 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను సుప్రీం కోర్టు తప్పుపట్టిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు’ అని గవర్నర్‌కు తెలిపారు.

ఇదీ చదవండి :అందుకే భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్: హరీశ్​రావు

Last Updated : Mar 8, 2022, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details