తెలంగాణ

telangana

ETV Bharat / city

పార్టీ నన్ను వదులుకోదు అంటోన్న ఎమ్మెల్యే రాజాసింగ్ - సస్పెన్షన్​పై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందన

MLA RajaSingh on Suspension పార్టీ నుంచి సస్పెన్షన్​పై భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పార్టీ తన వివరణతో సంతృప్తి చెందుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై తనకు నమ్మకముందని చెప్పారు. తాను విడుదల చేసిన వీడియోలో ఎవరినీ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.

MLA RajaSingh on Suspension
MLA RajaSingh on Suspension

By

Published : Aug 24, 2022, 12:45 PM IST

MLA RajaSingh on Suspension తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. వీలైనంత త్వరగా షోకాజ్ నోటీసులపై సమాధానం ఇస్తానని తెలిపారు. తన వివరణతో పార్టీ సంతృప్తి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ తనను వదులుకోదని అనుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై తనకు పూర్తి నమ్మకముందని అన్నారు.

తాను చేసిన వీడియోలో ఏ మతాన్ని కించపరచలేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. కోర్టు పరిమితుల దృష్ట్యా ఎక్కువగా మాట్లాడలేదని తెలిపారు. మిగతా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కుంటానని చెప్పారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్​పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయణ్ని అరెస్టు చేయగా.. బెయిల్​పై విడుదలయ్యారు.

రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలపై నగరమంతా కోపోద్రిక్తమైంది. ముఖ్యంగా పాతబస్తీలో ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. అర్ధరాత్రి పూట పాతబస్తీలో ప్రజలు ఆందోళనకు దిగారు. భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి రాజాసింగ్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ పాతబస్తీలో పరిస్థితులు టెన్షన్ టెన్షన్​గానే ఉన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు రాజాసింగ్ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు రాజాసింగ్​ను పలువురు భాజపా నేతలు పరామర్శిస్తున్నారు. రాజాసింగ్ ఇంటికి పరిపూర్ణానందస్వామి వెళ్లారు. అరెస్టు, పోలీసుల కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ రాజాసింగ్​ వివరణపై సానుకూలంగానే స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details