కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ అవుతున్నాయో.. లేదో.. మనమందరమూ పర్యవేక్షించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల భాజపా నాయకులు, కార్యకర్తలతో పొందూరులో ఆమె సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుతో కలిసి నిర్మలా సీతారామన్.. భాజాపా శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.
ప్రతీ ఒక్కరూ కార్యకర్తగా గ్రామాల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు వెనుకబడడానికి మనలోని లోపాలే కారణమన్న మంత్రి.. కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం 90 శాతంపైగా నిధులు కేటాయించినా.. మన పేరు ఎక్కడా లేని పరిస్థితి ఉందన్నారు. కొవిడ్ సమయంలో అనేక సదుపాయాలు కల్పించిన ఘనత మోదీదే అన్నారు. రాష్ట్రంలో భాజపాను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.