ఉమ్మడి నల్గోండ పర్యటనలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తెరాస కార్యకర్తలు చేసిన దాడిని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. దాడులు జరుగుతున్న ప్రేక్షక పాత్ర పోషించారంటూ.. పోలీసుల వైఫల్యాన్ని తీవ్రస్థాయిలో ఎండగట్టారు.
ఓడిపోతున్నామనే భయంతోనే..
కేంద్ర ప్రభుత్వం నిధులతో వరి కొనుగోలు ఎలా జరుగుతోందని పరిశీలించేందుకు వెళ్లిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్య అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఆర్వింద్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
"ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సందర్శనకు వెళ్తే తెరాస కార్యకర్తలు దాడులు చేశారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతోనే భాజపా నాయకులపై దాడులకు పాల్పడుతున్నారు. అప్పట్లో వరంగల్‌లో నాపైన కూడా ఇలాంటి దాడి జరిగింది. భాజపా కార్యకర్తలు.. ఇలా రెండు సార్లు మూడు సార్లు మాత్రమే చూస్తుంది. ఒక్కసారి.. ఓపిక నశించి ఎదురు తిరిగితే.. మూడే గంటల్లో తెరాస పార్టీ కనుమరుగైపోతుంది. ఏదైనా ఉంటే.. రాజకీయంగా ఎదుర్కొవాలి. ఇలా భౌతికంగా దాడులు చేస్తే.. ఎక్కడ దోషులుగా నిలబెట్టాలో అక్కడ నిలబెడతాం." - ధర్మపురి అర్వింద్, ఎంపీ