నాలాల్లో పూడికతీత, అక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట భాజపా ధర్నా చేపట్టింది. వర్షాకాలం ప్రారంభమైనా ప్రభుత్వం నాలాల పూడికతీతకు ఎలాంటి ప్రణాళికలను రూపొందించలేదని.. తక్షణమే చర్యలు చేపట్టాలని భాజపా శ్రేణులు గళమెత్తాయి. కార్యకర్తలు లోపలికి వెళ్లేందుకు గేట్లు ఎక్కడంతో పోలీసులు అడ్డుకున్నారు.
MLA Raja Singh : 'ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి పట్టదా'
హైదరాబాద్‌లో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం.. నాలాల పూడికతీతతో పాటు ఆక్రమణలు తొలగించాల్సిందిపోయి ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలాల్లో పూడికతీత పనులు చేపట్టాలని, అక్రమ కట్టడాలు తొలిగించాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కాషాయ శ్రేణులు చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు.
వినతిపత్రం ఇచ్చేందుకు ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రాంచంద్రారెడ్డిని అనుమతించారు. కార్పొరేటర్లను కార్యాలయంలోకి రానివ్వకపోవడంతో ఆగ్రహించి నిరసనకు దిగారు. ముందస్తు సమాచారం ఇచ్చినా కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో వినతిపత్రం ఇవ్వకుండా నేతలు బహిష్కరించి వచ్చారు.
గతేడాది వర్షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమై ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందని ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) ఆవేదన వ్యక్తం చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నాలాల పూడికతీతతో పాటు ఆక్రమణలు తొలగించాల్సిందిపోయి ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయిందని వాపోయారు.