మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై కమలదళం దృష్టి పెట్టింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఆయనతో వరస మంతనాలు జరుపుతున్నారు. తన భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఈటల వివిధ పార్టీలకు చెందిన నేతలను కొద్దిరోజులుగా కలుస్తున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కొందరు కీలకనేతలు, మాజీ ఎంపీలతో ఈటల ఇటీవల సమావేశమయ్యారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని అనుకుంటున్నానని.. హుజూరాబాద్‌కు వచ్చే ఉపపోరులో భాజపా తనకు మద్దతునివ్వాలని ఈ సందర్భంగా ఈటల వారిని కోరినట్లు సమాచారం. కమలనాథులు మాత్రం తమ పార్టీలో చేరాలని, రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని ఆయనకు వివరిస్తున్నారు.
కలిసి పోరాటం చేద్దాం...
ఈటల రాజేందర్, బండి సంజయ్ శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ నివాసంలో మూడు రోజుల క్రితం కొద్దిసేపు సమావేశమయ్యారు. వారం క్రితం ఇద్దరూ ఒకసారి ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా తన ఆలోచన చెప్పిన ఈటల భాజపా సహకారం కోరినట్లు తెలిసింది. జాతీయపార్టీగా భాజపా పోటీ చేయకుండా ఉండలేదని సంజయ్ స్పష్టం చేసినట్లు సమాచారం. మరో నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం రాష్ట్ర నేతలు, జాతీయ నాయకత్వం అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ‘భాజపాలోకి వస్తే కేసీఆర్ ప్రభుత్వంపై కలిసి పోరాటం చేద్దాం. మరోసారి ఆలోచించి మీ నిర్ణయం చెప్పాలని’ అన్నట్లు తెలిసింది. ‘ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం మంచి నిర్ణయం కాదు, ఉపఎన్నిక వస్తే ఓటమి పాలవుతావు’ అని సీనియర్‌నేత ఒకరు సలహా ఇచ్చారని సమాచారం. సోమవారం రాత్రి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తన వ్యవసాయ క్షేత్రంలో ఈటలతో సమావేశమై భాజపాలో చేరాలని ఆహ్వానించారు. ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన కీలక నేత ఒకరు పాల్గొన్నారు. దిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన నేరుగా అక్కడకు వచ్చి రాజేందర్‌తో మాట్లాడినట్లు తెలిసింది.