కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వడానికి బయల్దేరిన భాజపా నాయకుల్లో కొందరిని పోలీసులు అరెస్టు చేయడంతో పాటు మరికొందరిని గృహ నిర్బంధం చేశారు. వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో పరిస్థితిని వివరించడానికి భాజపా నాయకులు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ను కోరారు. అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో ఎమ్మెల్సీ రామచందర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌లతో కూడిన బృందం నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లడానికి నిర్ణయం తీసుకుంది. దీంతో శుక్రవారం ప్రగతిభవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో పాటు నాయకులను ఎక్కడికక్కడే గృహనిర్బంధంలో ఉంచారు.
అత్యవసర సమస్యలపై చర్చించాలనుకుంటే నిర్బంధాలకు దిగడం కేసీఆర్ నియంత వైఖరిని చాటుతోందని లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణలో ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా ఉందా? ఆర్టికల్ 370 లాంటిది ఇక్కడేమైనా అమలు జరుగుతోందా అని మండిపడ్డారు. రాజాసింగ్ ఒక వీడియో సందేశం విడుదల చేస్తూ.. కొవిడ్-19 నివారణ చర్యల్లో విఫలమైన సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రగతిభవన్‌కు బయల్దేరిన ఎమ్మెల్సీ రాంచందర్‌రావును ఓయూ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వారిని అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని రాంచందర్‌రావు అన్నారు. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.