తెలంగాణ

telangana

By

Published : Sep 28, 2020, 10:56 AM IST

ETV Bharat / city

భాజపా బలోపేతమే ఏకైక ఎజెండా : పురందేశ్వరి

ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు దీటుగా భాజపా ఎదగాలని.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దగ్గుబాటి పురందేశ్వరి ఆకాంక్షించారు. తదనుగుణంగా పార్టీ చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. కొత్త బాధ్యతను సమర్థంగా నిర్వహించడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 'ఈనాడు' ముఖాముఖిలో ఆమె మాట్లాడారు.

bjp-leader-purandeswari-interview
వైకాపాకు ప్రజలే బుద్ధి చెబుతారు: పురందేశ్వరి

దక్షిణాదిన పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. పశ్చిమ బెంగాల్‌లో మాదిరిగానే కేరళలోనూ పార్టీ బలపడుతోంది. కర్ణాటకలో భాజపా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు దీటుగా ఎదగాలి. ఇందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాల్సి ఉంది. తదనుగుణంగా పార్టీ చర్యలు తీసుకుంటోంది...’ అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. ‘కొత్త బాధ్యతను సమర్థంగా నిర్వహించడమే నా ముందున్న ప్రధాన లక్ష్యం. దీనిని పదవిగా కాకుండా బాధ్యతగా పరిగణిస్తున్నా. సహచర నేతలతో కలిసి పార్టీ అభివృద్ధికి అహర్నిశలు పని చేస్తా...’ అని వెల్లడించారు. ఆదివారం 'ఈనాడు' ముఖాముఖిలో ఆమె మాట్లాడారు.

అమరావతిపై భిన్నాభిప్రాయాలు లేవు..

రాజధాని విషయంలో భాజపా రెండు నాల్కల ధోరణితో వ్యవహరించడం లేదు. ద్వంద్వ వైఖరి ప్రసక్తే లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర పరిమితం. రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్రం వ్యవహరిస్తోంది. అమరావతిలో రాజధాని ఉండాలని పార్టీ రాష్ట్ర శాఖ తీర్మానం చేసింది. రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలోనూ సీనియర్‌ నాయకుడు రాంమాధవ్‌ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. కేంద్రం తన పరిమిత పాత్ర గురించి హైకోర్టుకు అఫిడవిట్ల రూపంలో చెప్పింది. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. పార్టీ పరంగా రాజధాని అమరావతిలో ఉండాలనే చెబుతున్నాం. రైతులకు న్యాయం జరగాలి. వారు స్థలాలు ఇచ్చినచోట అభివృద్ధి జరగాల్సిందే. ఇందులో ఎటువంటి భిన్నాభిప్రాయాలూ లేవు. ప్రస్తుతం కోర్టులో ఉన్నందున ఎక్కువ చర్చ అక్కర్లేదు.

వైకాపా పాలనపై చెప్పాల్సిన అవసరంలేదు..

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైకాపా పాలనపై ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైకోర్టు నుంచి 65-70 వ్యాజ్యాల్లో ఎదురు దెబ్బలు తగిలాయి. కొన్నింటిలో జీవోలను రద్దు చేస్తూ ఉత్తర్వులొచ్చాయి. అడుగడుగునా చీవాట్లు పడుతున్నాయి. దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. దేవాలయాల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండాపోతోంది. పార్టీపరంగా ప్రజాక్షేత్రంలో వీటిని ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వ చర్యలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. తగిన సమయంలో వారు బుద్ధి చెబుతారనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఏపీ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నాం...

గత ఎన్నికల్లో భాజపాకు వచ్చిన ఓటింగ్‌ శాతం తక్కువే. ప్రాంతీయ పార్టీలు ప్రత్యేక హోదా విషయంలో భాజపాను దోషిగా నిలబెట్టడంలో సఫలీకృతమయ్యాయి. హోదా ఇవ్వడం సాధ్యం కాకున్నా ‘స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌’ ఏర్పాటు చేస్తే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం వెల్లడించింది. గత ప్రభుత్వం దాని గురించి అసలు పట్టించుకోలేదు. ఎటువంటి వ్యత్యాసాలు చూపకుండా మోదీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తోంది.

మిత్రధర్మం పాటిస్తున్నాం...

ఏపీలో మిత్రపక్షంగా ఉన్న జనసేనతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తాం. పరస్పర సమన్వయం, సహకారంతో వ్యవహరిస్తాం. మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నాం. ప్రజల పక్షాన నిలబడితే తప్పకుండా వారి నుంచి ఆశీర్వాదం లభిస్తుంది.

మేం సన్నిహితంగానే ఉన్నాం..

ఎన్డీయే నుంచి మిత్రపక్షాలు వాటంతట అవే వైదొలుగుతున్నాయి. తెదేపా, శివసేన, ఆర్‌ఎల్‌ఎస్‌పీ అలాగే వ్యవహరించాయి. మిత్రపక్షాలతో భాజపా సన్నిహితంగానే వ్యవహరిస్తోంది. వాటికి ప్రాధాన్యం ఇస్తోంది.

ఇదీ చదవండీ :మావోయిస్టుల ఉన్నతస్థాయి సమావేశం జరిగిందా?

ABOUT THE AUTHOR

...view details