Konda Vishweshwar Reddy Comments: సీఎం కేసీఆర్‌ను అడ్డుకోవడం భాజపాకే సాధ్యమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇతర పార్టీలకు తెరాసను ఢీకొట్టే సత్తాలేదన్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మొదటిసారిగా నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ నెల 3న నిర్వహించిన విజయసంకల్ప సభ వేదికగా భాజపాలో చేరిన కొండా.. తొలిసారిగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రావడంతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. చేరికలపై ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో కొండాను సభ్యుడిగా నియమించారు. ఈ నేపథ్యంలో కొండాను బండి సంజయ్ సన్మానించారు.
ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టే అవకాశం లేదని కొండా పేర్కొన్నారు. తెరాసలో మూడే నడుస్తున్నాయని.. ఒకటి కాళ్లు మొక్కించుకోవడం... రెండోది డబ్బులు తీసుకోవడం.. మూడోది కేసులతో బెదిరించడమన్నారు. భాజపాలో చేరే విషయం కాంగ్రెస్ నేతలందరికి తెలుసన్నారు. రేవంత్ కంటే సీనియర్ నేతలకు కూడా తాను భాజపాలో చేరుతున్న విషయం తెలుసన్నారు. ఇన్ని రోజులు తాను తటస్థంగా ఉన్నా.. ఎవరూ పట్టించుకోలేదన్న కొండా... ఇప్పుడు భాజపాలో చేరే సరికి అందరూ అడుగుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.