తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆ విషయాలు సదరు మంత్రి తెలుసుకోవాలి' - telangana news today

రాష్ట్రంలో విద్యావంతులు, యువకులకు తెరాసపై వ్యతిరేకత ఉన్నందునే... కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని భాజపా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. పెండింగ్‌లో ఉన్న రైల్వేలైన్ల భూసేకరణ విషయాలు రాష్ట్ర పరిధిలోనివి అనే విషయాన్ని సదరు మంత్రి తెలుసుకోవాలని గుర్తు చేశారు.

bjp leader chintala ramachandra reddy comments Minister ktr
'ఆ విషయాలు సదరు మంత్రి తెలుసుకోవాలి'

By

Published : Mar 7, 2021, 3:44 AM IST

తెలంగాణకు కేంద్రం సహాయం నిరాకరణ చేస్తుందన్న మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సబ్‌కా సాత్‌-సబ్‌కా విశ్వాస్‌ లక్ష్యంతో అన్నీ రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముందుకెళ్తుందని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు.

రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి భాగస్వామిని చేస్తే.. హామీలు, సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతోందన్నారు. నీటి పారుదల, పారిశ్రామిక అభివృద్ధిలోనూ అన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాలను అందిస్తుందన్నారు.

ఖాజీపేట రైల్వే వ్యాగన్‌ సర్వీసింగ్‌ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం, భాజపా రాష్ట్ర నాయకత్వం భూసేకరణ విషయంలో... రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిన విషయం ఆయన గుర్తు చేశారు. కొత్త రైల్వేలైన్ల ప్రతిపాదన విషయంలో భూసేకరణ చేయకుండా కాలయాపన చేస్తున్నందునే అలస్యమవుతుందని పేర్కొన్నారు.

పెండింగ్‌లో ఉన్న రైల్వేలైన్లు. భూసేకరణ విషయాలు రాష్ట్ర పరిధిలోనివి అనే విషయాన్ని సదరు మంత్రి గుర్తించుకోవాలన్నారు. వ్యాక్సీన్ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడం వల్లనే త్వరితగతిన..కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వచ్చిందన్నారు. ఈ విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేయడం మంత్రికి తగదన్నారు.

పట్టభద్రులు తెలివైన వారని, వారికి అన్ని విషయాలపై అవగాహన ఉందని అన్నారు. అబద్దాలతో పట్టభద్రులను మోసం చేయాలనుకుంటే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాన్నారని హెచ్చరించారు. విద్యావంతులు, యువకులకు తెరాసపై వ్యతిరేకత ఉందనే... కేంద్రంపై ఆరోపణలు చేసి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆక్షేపించారు.

ఇదీ చూడండి :'తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి ఎన్నారైలు కృషి చేయాలి'

ABOUT THE AUTHOR

...view details