హుజూరాబాద్‌లో గెలుపు కోసం కేసీఆర్ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా.. నియోజకవర్గ ప్రజలు తనవైపే ఉంటారని భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender) ధీమా వ్యక్తం చేశారు. పాదయాత్రలో స్వల్ప అస్వస్థతతో అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మెరుగైన వైద్యం అందించిన ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తెరాసలో తెలంగాణ ఉద్యమకారులు కనుమరుగయ్యారని పేర్కొన్నారు. ఉద్యమ ద్రోహులంతా తెరపైకి వచ్చారని మండిపడ్డారు. మానుకోటలో ఉద్యమకారులపై రాళ్లువేసిన వ్యక్తికి ప్రాధాన్యమిచ్చారని విరుచుకుపడ్డారు. ఉద్యమకారులను రాళ్లతో కొట్టిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారని (MLC) ధ్వజమెత్తారు. తనతో కలిసి పనిచేసిన ఉద్యమకారులు ఇకనైనా ఈ అంశంపై ఆలోచించాలని సూచించారు.
కేసీఆర్ డబ్బుని నమ్ముకుని నేతలను కొనుగోలు చేస్తున్నారని ఈటల ఆరోపించారు. హుజూరాబాద్‌లో (Huzurabad) ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు చేశారన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికతో (Huzurabad by election) కేసీఆర్‌కు(CM KCR) హామీలు గుర్తొచ్చాయని వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతిని తక్షణమే అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఏడేళ్లలో ఎప్పుడైనా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారా? అని ప్రశ్నించారు.
దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ ఉపముఖ్యమంత్రిని తీసేశారు. దళిత కుటుంబాలకు రూ.10 లక్షల సాయాన్ని స్వాగతిస్తున్నా... రాష్ట్రంలోని దళితులందరికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను సైతం ఆదుకోవాలి.
-ఈటల రాజేందర్, మాజీ మంత్రి, భాజపా నేత