హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారులతో భాజపా జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్. సంతోష్ సమావేశమయ్యారు. ఎన్నేళ్ల నుంచి ఉన్నామనేది ముఖ్యంకాదని.. పార్టీ కోసం ఏమీ చేశావన్నదే ముఖ్యమని సంతోష్ స్పష్టం చేశారు. పార్టీ నిర్మాణం, ఓట్లు సాధన, వనరుల సమీకరణ దీంట్లో ఏదీ చేయలేని వారికి పార్టీ పదవులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఎదో ఒక సబ్జెక్టులో నిష్ణాతులు కావాలని సూచించారు. కష్టపడి పని చేస్తేనే పదవులు దక్కుతాయని చెప్పారు.
జిల్లాల్లో పర్యటించాలి
పదాధికారుల నుంచి పార్టీ పరిస్థితి అడిగి తెలుసుకున్న సంతోష్.. ప్రతి ఆఫీస్ బేరర్ అన్ని జిల్లాల్లో పర్యటించాలన్నారు. వాక్సిన్ కేంద్రాలు, రేషన్ దుకాణాలను సందర్శించాలని ఆదేశించారు. పోలింగ్ బూతులు పటిష్టంపై దృష్టి సారించాలన్నారు. సంస్థాగతంగా బలంగా లేక పోవడంతోనే బెంగాల్లో గెలవలేక పోయామన్నారు. మన్ కి బాత్‌ను అందరూ నేతలు వినడంతో పాటు ప్రతి పోలింగ్ బూత్‌లో మన్ కి బాత్ కార్యక్రమం వినేల ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ముందుగా ఒక 5 వేల బూతుల్లో ప్రతి నెల మన్కి బాత్‌లో కనీసం 10 మంది పాల్గొనేలా చూడాలని చెప్పారు.