BJP focus on telangana: రాష్ట్రంలో భాజపాను బూత్ స్థాయి నుంచే బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ జాతీయ సంస్థాగత ప్రధానకార్యదర్శి బీఎల్.సంతోష్, సహా కార్యదర్శి శివప్రకాశ్ రంగంలోకి దిగారు. నేడు భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలతో.. సంతోష్, శివప్రకాశ్, తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ప్రజల్లో ఎలాంటి చర్చ జరగుతోందని అడిగి తెలుసుకున్నారు.
భాజపా అధికారంలోకి రాబోతున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటనీ.. సంతోష్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని.. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పాత, కొత్త కలయికతో సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. పట్టణాల్లో, పార్టీ కార్యాలయాల్లో సమావేశాలకు పరిమితం కాకుండా.. నెలకు కనీసం 20 రోజులైన ప్రజా క్షేత్రంలో ఉండాలని ఆదేశించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడంతో పాటు కార్యకర్తలను, వివిధ వర్గాల వ్యక్తులను కలవాలన్నారు. రాబోయే రోజుల్లో పార్టీలోకి ముఖ్యనేతలు వస్తారని తెలిపిన సంతోష్.. ఆపరేషన్ ఆకర్ష్‌కు పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సంకేతాన్నిచ్చారు. పాత, కొత్త అనే విభేదాలు పెట్టుకోకుండా పనిచేయాలన్నారు.